హైదరాబాద్: తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 8 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ ప్రకటించింది. మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి సంగారెడ్డి, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రామంతాపూర్‌లో భారీ వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఉప్పల్‌లో అత్యధికంగా 21.2 సెం.మీ వర్షపాతం నమోదుకాగా... అబ్దుల్లాపూర్‌మెట్ 20, వనస్థలిపురం 19.2 సెం.మీ, హస్తినాపురం 19, పెద్ద అంబర్‌పేట్‌లో 18 సెం.మీ, సరూర్‌నగర్ 17.9, హయత్‌నగర్‌లో 17.2 సెం.మీ, రామంతాపూర్‌లో 17.1, హబ్సిగూడలో 16.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.










