Oct 04,2020 19:06
బాలల కథ

క మడుగులో చాలా చేపలుండేవి. ఒకరోజు నక్క ఎలాగైనా వాటిని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అది గమనించిన ఒక పెద్ద చేప మిగతా చేపలన్నింటిని హెచ్చరించింది. వెంటనే చేపలన్నీ ఒక రాయి కింద దాక్కున్నాయి. ఆరోజు ఎంత వేచి ఉన్నా నక్కకు ఒక చేప కూడా దొరకలేదు. అది నిరాశతో వెనుకకు వెళ్లింది.


మరుసటి రోజు నక్క మళ్లీ ఆ మడుగు దగ్గరకు వచ్చింది. నక్క రాకను గమనించిన పెద్ద చేప మళ్లీ హెచ్చరించింది. వెంటనే మిగిలిన చేపలన్నీ తిరిగి ఆ రాయి కింద దాక్కున్నాయి. తనకు ఆహారం అందకుండా చేస్తున్న పెద్ద చేప పని పట్టాలని నక్క అనుకుంది.


మిగతా చేపలన్నింటినీ రక్షిస్తున్న పెద్ద చేపను నక్క అతి కష్టంమీద తన నోటితో అందుకోగలిగింది. పెద్ద చేపను తిందాము అనుకునే సరికి చిన్న చేపలన్నీ నక్క చుట్టూ తిరగడం మొదలెట్టాయి. కళ్లముందు చాలా చేపలు కనిపిస్తూ ఉండేసరికి పెద్ద చేపను వదిలేసి చిన్న చేపలను పట్టుకుని తినబోయింది నక్క. అంతే పెద్ద చేప 'చిన్నపిల్లలు వాటిని వదిలేసి నన్నే తిను' అంటూ ముందుకు వచ్చింది. నక్క ఆలోచనలో పడింది ఆలోపు చిన్న చేపలన్నీ తప్పించుకున్నాయి. వెంటనే పెద్ద చేప నక్కబారి నుంచి అతికష్టం మీద తప్పించుకుంది. 'ఛీ! నోటికి దొరికిన దానిని వదలి పెట్టానే. నా అంత మూర్ఖురాలు ఇంకొకరు లేరు' అని నక్క బాధపడింది.


ఇంకొక రోజు నక్క తిరిగి ఆ మడుగు దగ్గరకు వచ్చింది. అప్పటికే పెద్ద చేప, చిన్న చేపలన్నీ బండ రాయి కింద దాక్కుని ఉన్నాయి. పెద్ద చేప సలహాతో తాబేలు కొద్దిగా నీటి పైకి వచ్చింది. అది కూడా చేప అని భ్రమించిన నక్క దాని డిప్పను గట్టిగా కొరికింది. అది దానికి మింగుడు పడలేదు. అప్పుడు తాబేలు ''నక్కబావా! నీవు నన్ను తినలేవు. ఈ మడుగు చేపలనూ తినలేవు. ఎందుకంటే నిన్ననే కొందరు ఈ మడుగులో విషం కలిపారు. ఆ విషాన్ని తిన్న చేపలను నేను ఆరగించాను. అందువల్ల మెత్తగా ఉన్న నా శరీరం గట్టిగా మారిపోయింది. కావాలంటే నన్ను కొరికి చూడు. నీకే తెలుస్తుంది. నీవు ఈ చేపలను తింటే నీ గతి కూడా అంతే. నేను కాబట్టి తట్టుకున్నాను. నీవు ఈ చేపలను తింటే చావడం ఖాయం'' అని అంది.


అది విన్న నక్క భయంతో 'బ్రతుకు జీవుడా' అంటూ అక్కడ నుండి పరుగు తీసింది. పెద్ద చేప పన్నిన వ్యూహాన్ని తాబేలు చక్కగా అమలు చేసి చేపలన్నింటిని కాపాడింది.


- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
9908554535