Apr 20,2023 07:43
  • సోలార్‌ పవర్‌ తీసుకోవడంపై ప్రభుత్వం తిరకాసు
  • కొనుగోలు రూ.4.60
  • అమ్మకం రూ.10.15
  • రూ.లక్షలు వెచ్చించి
  • సోలార్‌ సెటప్‌ పెట్టుకున్న సంస్థలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా ఎక్కడికక్కడ సోలార్‌ విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. ఫిబ్రవరి నుండి నేరుగా విద్యుత్‌ కొనుగోలు చేస్తామని, అమ్మకాలకు, సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు ఎటువంటి సంబంధమూ లేదని, దేని బిల్లు దానికేనని ప్రకటించింది. దీంతో రూ.లక్షలు వెచ్చించి సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకున్న సంస్థలు ఇప్పుడు లబోదిబోమంటున్నాయి. తాము వాడుకునే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.10.15 పైసలు కడుతున్నామని, అమ్ముదామంటే రూ.4.60 పైసలు మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. విజయవాడ వంటి నగరంలో ఓ సంస్థ తమ విభాగాలున్న నాలుగు చోట్ల సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసింది. దీనికిగానూ ఒక యూనిట్లో నెలకు 1800 యూనిట్ల సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. నాలుగు యూనిట్లలోనూ ఇదే తరహాలో నెలకు 1800 యూనిట్ల చొప్పున ఉత్పతి సాధిస్తోంది. ఈ ఏడాది జనవరి వరకూ వీరిదగ్గర ఉత్పత్తయిన విద్యుత్‌ (యూనిట్లు) మినహాయించుకుని మిగిలిన యూనిట్లకు బిల్లు వసూలు చేస్తున్నారు. ఫిబ్రవరి నుండి పద్ధతి మార్చారు. ఇక నుండి యూనిట్లో ఉత్పత్తయిన విద్యుత్‌కు మినహాయింపు ఇవ్వబోమని, వాడుకున్న విద్యుత్‌కు పూర్తిగా బిల్లు చెల్లిస్తే తాము కొనుగోలు చేసిన విద్యుత్‌కు తిరిగి డబ్బు చెల్లిస్తామని తెలిపారు. అయితే విద్యుదుత్పత్తి చేసిన సంస్థ 11,500 యూనిట్లు వినియోగించింది.
దీనికిగాను రూ.10.15 చొప్పున విద్యుత్‌ సంస్థలు డబ్బులు కట్టించుకున్నాయి. వీరిదగ్గర కొన్న 1800 యూనిట్లకు రూ.4.60 చొప్పున ఇస్తామని తెలిపారు. ఆ బిల్లులు కూడా వెసులుబాటు చూసుకుని చెల్లిస్తామని ప్రకటించడంతో సోలార్‌ ప్యానల్‌ పెట్టుకున్న సంస్థ విస్తుబోయింది. ఒకవేళ తాము ఉత్పత్తిచేసే విద్యుత్‌ను వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా దానికి అంగీకరించలేదని యజమానులు తెలిపారు. అమ్మితే పూర్తిగా తమకే అమ్మాలని, నేరుగా వాడుకోవడానికి లేదని స్పష్టం చేశారని చెబుతున్నారు. తొలుత తమను ప్యానెల్స్‌ పెట్టుకోవాలని ప్రోత్సహించి ఇప్పుడు నిరుత్సాహ పరుస్తునాన్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంస్థలు నెలకు 3000 యూనిట్లు కూడా ఉత్పత్తి చేస్తున్నాయని, దానికంటే తక్కువ విద్యుత్‌ను వాడుకుంటున్నా నేరుగా వినియోగించుకునే అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే విద్యుత్‌శాఖ అధికారులను కలిసి తాము ఉత్పత్తి చేసుకున్న విద్యుత్‌ నేరుగా తామే వాడుకునేలా అవకాశం ఇవ్వాలని కోరనున్నామని, లేదా బిల్లులో మినహాయింపు ఇవ్వాలని కోరనున్నామని యజమానులు తెలిపారు.