విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పిపిఎ) అమలులోకి రాకముందు కాలానికి విశాఖపట్నంలోని హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ (హెచ్‌ఎన్‌ఎసిఎల్)కు చెందిన 1040 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు అదనంగా స్థిర ఛార్జీలు చెల్లింపు వ్యవహారంపై ఏదైనా వివాదం ఉంటే, ఆ ఒప్పందంలో భాగస్వాములలో ఎవరైనా దానిని కమిషన్ ముందు లేవనెత్తవచ్చునని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఎపిఇఆర్‌సి) పేర్కొంది. హెచ్‌ఎన్‌ఎపిసిఎల్‌కు, డిస్కాంలకు మధ్య కుదిరిన పిపిఎకు, చెల్లించాల్సిన ఛార్జీలకు అనుమతిస్తూ, గతేడాది ఆగస్టు మొదటి తేదీన తామిచ్చిన ఉత్వర్వుకు విరుద్ధంగా ఏమైనా చెల్లింపులు చేస్తే, ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు (ఎపిపిపిసిఎ) కింద ఆ చెల్లింపులను అనుమతించబోమని కమిషన్ 2023-24 సంవత్సరానికి ఇచ్చిన విద్యుత్ ఛార్జీల ఉత్తర్వులో స్పష్టం చేసింది. 2020 ఆగస్టు 21 నుంచి 2022 ఫిబ్రవరి 2వ తేదీ వరకు గల కాలంలో సరఫరా చేసిన, చేయని విద్యుత్‌కు రూ.1200 కోట్ల మేరకు హిందూజాకు అక్రమంగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అలా చెల్లించరాదని డిస్కాంలను ఆదేశించాలని వార్షిక ఆదాయ అవసరాలపై బహిరంగా విచారణ సందర్భంగా కమిషన్ను కోరాము. దానిపై కమిషన్ పైవిధంగా ప్రతిస్పందించింది. ఈ కేసులో అసాధారణ పరిస్థితులు, వాస్తవాల దృష్ట్యా హిందూజా ప్రాజెక్టు మొదటి యూనిట్ వాణిజ్యపరంగా పనిచేయటం ప్రారంభించిన తేదీ (సిఒడి) నుంచి 2022 జులై 31 వరకు ఎప్పటికప్పుడు నిర్ణయించిన ఛార్జీలే తుది ఛార్జీలు అవుతాయని గత ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వులో కమిషన్ స్పష్టం చేసింది. ఆ కాలంలో కమిషన్ ఉత్తర్వుల ప్రకారం హిందూజా సరఫరా చేసిన విద్యుత్‌కు డిస్కాంలు కమిషన్ నిర్ణయించిన ఛార్జీలను చెల్లించాయి. ఎపిఇఆర్‌సిలో రెండేళ్లకుపైగా జరిగిన విచారణలో, వార్షిక ఎఆర్‌ఆర్‌పై జరిగిన విచారణలో, అప్పిలేట్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో హిందూజాపై కాలానికి సరఫరా చేసిన, చేయని విద్యుత్‌కు డిస్కాంలు అదనపు చెల్లింపులు చేయాలన్న ప్రస్తావన కూడా చేయలేదు. ఉత్తర్వుల్లోని ఈ అంశంతో సహా పలు అంశాలను ప్రశ్నిస్తూ, హిందూజా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కమిషన్లో పెండింగులో ఉంది. దానిపై ప్రతివాదులైన డిస్కాంలు తమ వైఖరిని కమిషన్ దాఖలు చేయకుండా గడువును పొందుతూ వస్తున్నాయి. ప్రభుత్వ వైఖరి దృష్ట్యా డిస్కాంలు తమ కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు కోరుతూ వస్తున్నాయి. కౌంటర్ దాఖలు చేసేందుకు ఏప్రిల్ 12వరకు కమిషన్ గడువు ఇచ్చింది.
ఇదిలా ఉండగా, కమిషన్‌పై ఉత్తర్వు ఇవ్వటానికి ముందు తాను సరఫరా చేసిన, చేయని విద్యుత్ భారీగా అదనపు చెల్లింపులు చేయాలని హిందూజా కంపెనీ డిస్కాంలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తర్జనభర్జనలు చేసి, హిందూజాకు రూ.1234.68 కోట్ల మొత్తాన్ని అదనంగా చెల్లించేందుకు అనుమతించింది. ఈ మొత్తాలను చెల్లించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్) లేదా గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆసి) నుండి రుణం పొందేందుకు దరఖాస్తు చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న జారీ చేసిన 19వ నెంబరు జిఓలో ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ రుణానికి ప్రభుత్వ గ్యారంటీ పొందటానికి అనుమతిచ్చింది. న్యాయపరమైన అంశాలు, వివిధ మార్గాలను పరిగణనలోకి తీసుకుని, ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలించాక ఈ మేరకు ఆదేశాలిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పిఎస్‌సి నుండి నాలుగు విడతలుగా ఈ రుణాన్ని పొంది, హిందూజాకు చెల్లించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎపిఇఆర్‌సి ముందుకు వెళ్లాలని ఆర్థికశాఖ కార్యదర్శి అభిప్రాయం, లేదా రూ.400 కోట్లు చెల్లించటం, లేదా రూ.1234 కోట్లు చెల్లించటం, లేదా హిందూజా క్లెయిమును తిరస్కరించటం ప్రభుత్వ పరిశీలనకు వచ్చిన ప్రతిపాదనలు. ఈ వ్యవహారంలో అడ్వకేట్ జనరల్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అభిప్రాయాలను ప్రభుత్వం పొందింది. ఈ న్యాయనిపుణుల అభిప్రాయాలు ఏవైనా, చట్టపరంగా అవి కమిషన్ ఉత్తర్వును అధిగమించలేవు. ప్రభుత్వ నిర్ణయం ఎపిఇఆర్‌సి ఉత్తర్వును ఉల్లంఘించటం, చట్టవిరుద్ధం అవుతుంది. ఎఆర్‌ఆర్‌పై కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణ సందర్భంగా డిస్కాంలు వివరాలేమీ తెలపకుండా, ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని దాటవేత సమాధానం ఇచ్చాయి. ఈ వ్యవహారంలో ఎవరి స్వార్థ ప్రయోజనాలేమిటనేది ఎవరైనా ఊహించుకోవచ్చు. విద్యుత్ చట్టం, 2003 ప్రకారం రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుండి డిస్కాంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు ఛార్జీలను నిర్ణయించటం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ పరిధిలోనిది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యానికి తావు లేదు. ఈ అంశంపై హిందూజా రివ్యూ పిటిషన్ కమిషన్లో పెండింగులో ఉండగా, దానిపై డిస్కాంలు తమ వైఖరేమిటో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయకుండా, ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకున్న తీరు అనుచితం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తమ వైఖరిని డిస్కాంలు కమిషన్‌కు తమ కౌంటర్లో తెలుపుతాయనేది స్పష్టం. ఈ పరిస్థితిలో, హిందూజా, డిస్కాంల మధ్య వివాదం తలెత్తి, కమిషన్లో కొత్తగా పిటిషన్ దాఖలు చేసే పరిస్థితికి తావులేదు. ఇంత భారీ మొత్తాల చెల్లింపు ఇమిడివున్న హిందూజా రివ్యూ పిటిషన్‌పై కమిషన్ బహిరంగ విచారణ కూడా జరపటం లేదు.
కమిషన్ హిందూజా పిపిఎకి అనుమతిస్తూ, ఛార్జీలను నిర్ణయిస్తూ ఉత్తర్వును జారీ చేసిన తేదీ నుండి పిపిఎలోని అంశాలు అమలులోకి వస్తాయి. తాము వివరించిన కారణాల వల్ల, పిపిఎ అమలులోకి రాకపూర్వం హిందూజా సరఫరా చేసిన (చేయని) విద్యుత్‌కు గతం నుండి అమలులోకి వచ్చే విధంగా ఈ ఉత్తర్వులో నిర్ణయించిన ఛార్జీలను వర్తింపజేస్తే, డిస్కాంలు భారీగా ట్రూఅప్ క్లెయిములు చేయాల్సి వస్తుందని, ఆ భారం అంతిమంగా వినియోదారులపై పడుతుందని, ప్రజా ప్రయోజనానికి ఇది పెద్ద నష్టం కలిగిస్తుందని కమిషన్ తన ఉత్తర్వుల్లో వివరించింది. హిందూజాకు ఇంత భారీగా ప్రజాధనాన్ని అదనంగా సమర్పించే ప్రభుత్వ నిర్ణయం కమిషన్ ఉత్తర్వుకు పూర్తిగా విరుద్ధం. తమ ఉత్తర్వుకు విరుద్ధంగా డిస్కాంలు చెల్లింపులు చేస్తే, వాటికి సంబంధించి అవి చేసే ఎపిపిపిసిఎ క్లెయిములను తిరస్కరిస్తామని ఛార్జీల ఉత్తర్వులో కమిషన్ పేర్కొనటంలో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. హిందూజాకు పై విధంగా అదనపు చెల్లింపులు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం దృష్ట్యా, ఆ మేరకు హిందూజా రివ్యూ పిటిషన్ను తాము వ్యతిరేకిం చటం లేదని డిస్కాములు కమిషన్‌కు నివేదించే అవకాశాన్ని తోసిపుచ్చలేము. ఈ రివ్యూ పిటిషన్‌పై విచారణ ప్రక్రియ ఎప్పటికి పూర్తయి, కమిషన్ ఉత్తర్వు వస్తుందో, ఉతర్వు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. రివ్యూ పిటిషన్ కమిషన్ ఇచ్చే ఉత్తర్వును బట్టి పై మొత్తాల చెల్లింపుకు సంబంధించి డిస్కాములు చేసే ఎపిపిపిసిఎ క్లెయిములపై కమిషన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. రికార్డయిన వాస్తవ అంశాలలో ఏదైనా తేడా వుంటే తప్ప రివ్యూ పిటిషన్లపై ఇచ్చే ఉత్తర్వుల్లో సాధారణంగా మార్పులు జరగవు.
రివ్యూ పిటిషన్‌పై కమిషన్ నియంత్రణ ప్రక్రియ జాప్యమైతే, ఈలోగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం హిందూజాకు డిస్కాంలు చెల్లింపులు చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయనేది మరో అంశం. వచ్చే నెల నుంచి అలా చెల్లింపులు ప్రారంభమైతే, ఆ మొత్తాలను ఎపిపిపిసిఎ నిబంధనల కింద యూనిట్‌కు నెలకు 50 పైసల చొప్పున కమిషన్ ముందస్తు అనుమతి లేకుండా డిస్కాంలు వినియోగదారుల నుండి వసూలు చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ఎపిపిపిసిఎ క్లెయిములను పరిశీలించి ఉత్తర్వులిచ్చే విధంగా కమిషన్ ఈ నిబంధనలను సవరించేందుకు ప్రకటించిన ప్రతిపాదనలు అమలు లోకి వస్తే, 2023-24కు సంబంధించిన ఎపిపిపిసిఎ క్లెయిములు 202425లో కమిషన్ పరిశీలనకు, ఉత్తర్వు కోసం వస్తాయి. 2023-24 సంవత్సరానికి కమిషన్ లెక్కగట్టిన మూడు డిస్కాంల విద్యుత్ విక్రయాలు 67890.21 మి.యూ.లలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 10202.44 మి.యూ. తగ్గిస్తే, మిగిలిన 57687.77 మి.యూ.లపై యూనిట్ 50 పైసల చొప్పున డిస్కాంలు కమిషన్ ముందస్తు అనుమతి లేకుండా రూ.2884.38 కోట్లు ఎపిపిపిసిఎ కింద వసూలు చేసుకోవచ్చు. అంటే, హిందూజాకు ప్రభుత్వ అనుమతి మేరకు చెల్లించిన అదనపు మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిస్కాంలు వినియోగదారుల నుండి వసూలు చేస్తాయి. ఏడాది తరువాత ఆ మొత్తాలకు డిస్కాంల ఎపిపిపిసిఎ క్లెయిములను తన ఉత్తర్వుకు విరుద్ధమని కమిషన్ తిరస్కరించినా, హిందూజా నుండి ఆ మొత్తాలను తిరిగి రాబట్టటం వివాదాలకు దారితీస్తుంది.
- ఎం వేణుగోపాలరావు










