Jan 02,2023 16:20

ప్రజాశక్తి - అనకాపల్లి : ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలోని చింతపల్లి మండలం ఎర్రవరం, అనంతగిరి మండలం పెదకోట, దేవరాపల్లి మండలం రైవాడ వద్ద ప్రతిపాదిత పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజన చట్టాలు, హక్కులను పక్కన పెట్టి హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దుర్మార్గమని తెలిపారు. గిరిజనుల అభిప్రాయాలు, ఆకాంక్షలతో నిమిత్తం లేకుండా అటవీ ప్రాంతంలో అదానీ వంటి కార్పొరేట్‌ శక్తులకు అటవీ వనరులను కట్టబెట్టే ప్రయత్నాలను ప్రజా పోరాటాల ద్వారా సిపిఎం ప్రతిఘటిస్తుందని పేర్కొన్నారు. గతంలో ఎపిఎండిసిని అడ్డుపెట్టుకొని బాక్సైట్‌ ఖనిజాన్ని అన్‌రాక్‌ కంపెనీకి అప్పజెప్పడానికి ఏ తరహా ప్రయత్నాలు ప్రభుత్వాలు చేశాయో ప్రస్తుతం ఎర్రవరం, పెదకోట వద్ద హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను నెడ్‌క్యాప్‌ ద్వారా అప్పజేప్పేందుకు అలానే ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బాక్సైట్‌ ఒప్పందాలు, జిఒలు రద్దు అయ్యేవరకు నాడు గిరిజనులు ఏ విధంగా పోరాటం చేశారో నేడు కూడా అదే తరహాలో పోరాటాలు నిర్వహించనున్నారని తెలిపారు. రైవాడ వద్ద హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల రైవాడ జలాశయానికి వచ్చే నీటి వనరులు తగ్గిపోతాయని, ఆయకట్టు రైతులకు, విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడనుందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీప్రదేశ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోందని విమర్శించారు. ఇప్పటికే గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను అప్పగించిందని, డేటా సెంటర్‌ పేరుతో విశాఖ నగరంలో లక్షల కోట్లు విలువ చేసే భూములను కారుచౌకగా కట్టబెడుతోందని, తాజాగా అడవులను, జలాశయాలను కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఏకపక్షంగా హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుపై ముందుకెళ్తే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.