Feb 24,2023 21:14

నామినేషన్‌ పత్రాలు పరిశీలిస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

కడప ప్రతినిధి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం దిశగా సాగుతోంది. నామినేషన్‌ గడువు చివరి రోజున వైసిపి అభ్యర్థి మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి ప్రత్యర్థిగా పోటీ చేయడానికి ఒక నామినేషన్‌ దాఖలైంది. 24 గంటల్లోపే మరుసటి రోజైన శుక్రవారం నిర్వహించిన స్క్రూటినీలో ప్రత్యర్థి నామినేషన్‌ తిరస్కృరణకు గురికావడం అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే నామినేషన్‌లు దాఖలు చేయడం సహజం. కానీ ఇంతటి స్వల్ప సమయంలోనే ప్రత్యర్థి పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేయడం వెనుక దాగిన రహస్యంలోని మర్మమేమిటో తెలియడం లేదు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రలోభపూరిత ఏకపక్ష ఎన్నికల రాజకీయ పరిశీలకుల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. ఏకగ్రీవ, ఏకపక్ష స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావడం అనివార్యంగా మారనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి తన నామినేషన్‌ పరిశీలన రోజున తిరస్కరణ కావడం పట్ల ఆసక్తి కనబరచకపోవడం గమనార్హం. వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి గెలుపునకు లైన్‌క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. 2017 నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ మద్దతు కలిగిన వైసిపి అభ్యర్థి వైఎస్‌ వివేకా నందరెడ్డి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టిడిపి అభ్యర్థి బి.టెక్‌ రవి గెలుపునకు అవలంభించిన పద్ధతులు సంచలనాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. 2017 నాటి టైమ్‌ క్యాలెండర్‌ ప్రజల స్మృతిపథంలో నుంచి తొలగకమునుపే 2023 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం దిశగా నడవడం చర్చనీయాంశంగా మారింది. వైసిపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.