అంటరాని కులమైన మెహర్ కులంలో పుట్టి ఎన్నో అవమానాల చవిచూసి మొక్కవోని పట్టుదలతో విద్యనభ్యసించి... పిహెచ్‌డిలు చేసి అమెరికా నుండి డాక్టరేట్ పట్టా పట్టుకొని...మన దేశంలో అడుగు పెట్టిన మొట్టమొదటి నిమ్న కులస్తుడు డాక్టర్ భీమ్‌రావు రాంజీ అంబేద్కర్. సాహు మహారాజ్ ప్రోత్సాహంతో అమెరికా, లండన్‌లలో పరిశోధనలు చేసి ''ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవెన్షియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా'' పరిశోధన వ్యాసం రాసి బ్రిటీషు పాలకులనే అబ్బుర పరిచిన మేధావి మన అంబేద్కర్. ఉదయాన్నే లండన్ లైబ్రరీ తలుపులు ఎప్పుడు తెరుస్తారా ఎప్పుడు లోనికి వెళ్ళి చదువుకుందామా అని ఎదురుచూసేవాడు. తెరిచిన వెంటనే లోనికి ప్రవేశించి, రాత్రి తలుపులు మూసే వరకు అధ్యయనంలోనే లీనమయ్యేవాడు. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉండి జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే రాజ్యాంగాన్ని రచించిన మేధావి అంబేద్కర్.
అంటరానితనానికి వ్యతిరేకంగానే కాకుండా సమానత్వం కోసం తన కొన ఊపిరి వరకు పోరాడిన సమతామూర్తి అంబేద్కర్. అందుచేతనే అంబేద్కర్ పుట్టిన రోజును భారత ప్రభుత్వం గతంలో సమతాదినంగా నిర్వహించగా అంతర్జాతీయ సమతాదినంగా ఐక్యరాజ్యసమితి గతంలో ఘనంగా నిర్వహించింది. ప్రపంచ మేధావులలో ఒకరిగా ఐక్యరాజసమితి అంబేద్కర్‌ను గుర్తించింది. మూక్‌నాయక్, బహిష్కృత భారతి పత్రికలను నిర్వహించి దళితుల్లో చైతన్యం తీసుకు రావడానికి ఆయన ఎంతగానో తపనపడ్డాడు.
అంటరానితనానికి వ్యతిరేకంగా విరామం లేకుండా పోరాటం సల్పిన ధీరోదాత్తుడు అంబేద్కర్. కుల వ్యవస్థ నిర్మూలిస్తేనేగాని మన దేశం అభివృద్ధి చెందదని చెప్పేవాడు. ఎటు చూసినా సామాజిక అసమానతలు కనిపిస్తాయని, అసమానతలు రూపుమాపాలంటే ప్రజలు చైతన్యంతో పోరాడితే తప్ప అసమానతలు రూపుమాసిపోవని అన్నాడు. మన దేశంలో వర్గ అసమానతలు లేని, కుల వివక్షత లేని సమాజం కోసం ఆయన పోరాడాడు.
అంబేద్కర్ అర్థరాత్రి దాటేవరకు చదువుతూనే ఉండేవాడు. ఒక సందర్భంలో ఒక విలేకరి అంబేద్కర్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ 'అర్థరాత్రి దాటినా మీరు మేల్కొని చదువుతూనే ఉంటారు ఎందుకని?' అని అడిగాడు. 'నా ప్రజలకు చైతన్యం లేదు కనుక వారు నిద్రపోతున్నారు. వారిలో చైతన్యం రగిలించడం కోసం నేను నిద్ర లేని రాత్రిళ్ళు గడుపుతున్నాను' అని చెప్పాడు. మన దేశం లోని హిందూ సమాజం కుల చట్రపు అసమానతలతో కూడి ఉన్నది. మను ధర్మ శాస్త్రం వర్ణ వ్యవస్థకు పునాదిగా ఉండి, మనుషులలో అంతరాలను ఏర్పరచి అగ్రకులాలు, నిమ్న కులాలుగా చీల్చి నిమ్న, శూద్ర కులాల ప్రజలను అత్యంత హీన స్థితిలోకి నెట్టి అగ్రవర్ణ దురహంకారాన్ని పెంచి పోషిస్తున్నది. అందుచేతనే అసమానతలకు నిలయం మనుధర్మ శాస్త్రం. దానిని విసర్జించే వరకూ హిందూ మతాన్ని సంస్కరించడం ఎవరివల్ల కాదు. కనుకనే నేను హిందూ మతాన్ని వీడాలనుకుంటున్నాను. పుట్టుక నా చేతిలో లేదు కనుక నేను హిందువుగా పుట్టాను. కాని నేను హిందువుగా మాత్రం చావను అని బహిరంగంగానే ప్రకటించాడు.
పంచమ కులస్తులను మనుషులుగా చూడకుండా అంటరానివారిగా చిత్రించి ఊరికి దూరంగా నెట్టి అగ్ర కులస్తులకు సేవ చేసే బానిసలుగా మార్చింది మనుధర్మశాస్త్రం. ఏ దిక్కుకు వెళ్ళినా అక్కడ కుల రక్కసి కనిపిస్తుంది. కుల రక్కసిని ఎదుర్కోకుండా నీవు ఏ సంస్కరణలను ముందుకు తీసుకుపోలేవు. అని నిరంతరం ఘోషించాడు. 1927లో మహాద్ పట్టణంలో చౌదార్ చెరువులో దళితులు నీరు తాగినందుకు దళితులపై దాడిచేసి అగ్రవర్ణ హిందువులు కొడతారు. ఆ సందర్భంగా డిసెంబర్ 25న పెద్ద బహిరంగ సభ జరిపి ఆ సభలో రాత్రి 9 గంటలకు నినాదాల హోరు మధ్య మనుధర్మ శాస్త్ర గ్రంథాన్ని తగలబెట్టాడు అంబేద్కర్. కాని నేటికీ ఈ దురాచారాలు రాజ్యమేలుతున్నాయి. మరొక ఐదు సంవత్సరాలు గడిస్తే మనుధర్మ శాస్త్రం తగలబెట్టి శత వసంతాలు పూర్తి అవుతాయి. కానీ ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం లోని బిజెపి మనుధర్మ శాస్త్ర, దురాచారాలను నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ అసమాతలను మరింత తీవ్రం చేస్తున్నది. దళితులను హీనంగా చూస్తూ దళితులపై దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. దళిత స్త్రీలను అత్యాచారం చేసి చంపేస్తున్నారు. ముస్లింలపై దాడులు చేసి హత్యలు చేస్తున్నారు. గోవధ నిషేధం పేరుతో, ఆవుల చర్మాన్ని వలుస్తున్నారనే నెపంతో దళితులపై దాడి చేస్తున్నారు.
భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. ఇది ఫెడరల్ స్వభావాన్ని కలిగి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమైక్యతను సూచిస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ సమతా భావనలకు మార్గం చూపుతున్నది. చుట్టు పక్కల దేశాలలో అనేక సంక్షోభాలు తలెత్తినా...మన దేశం ప్రజాస్వామ్య స్ఫూర్తితో గణతంత్ర రాజ్యంగా నిలబడడానికి కారణం మన రాజ్యాంగ వ్యవస్థే. ఇటువంటి రాజ్యాంగాన్ని ఏదొక విధంగా రద్దు చేయాలని లేదా పక్కన పెట్టి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని బిజెపి పాలకులు చూస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య విభేదాలు చూపకుండా పాలకులు వ్యవహరించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలిపి, అనైక్యతను సృష్టించి మైనార్జీ మతస్తులపై, దళితులపై దాడులకు పూనుకుంటున్నారు. రాజ్యాంగానికి పెను ప్రమాదాన్ని తెస్తున్నారు. దేశ స్వావలంబనకు కీలకమైన ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తూ మరొకపక్క బహుళజాతి సంస్థలను ఆహ్వానిస్తూ నగదీకరణ పేరుతో మన సంపదను వారికి అప్పగించడానికి రంగం సిద్ధం చేశారు.
ప్రైవేట్ పరిశ్రమలను జాతీయం చేసి ప్రభుత్వమే నిర్వహించాలి అని అంబేద్కర్ చెప్పాడు. ఆనాడు ప్రైవేట్ రంగంలో ఉన్న ఇన్సూరెన్స్, బ్యాంక్‌లను జాతీయం చేయాలని, భూస్వాములు, సంస్థానాధిపతుల చేతిలో ఉన్న భూములను ప్రభుత్వం జాతీయం చేయాలని ఆయన చాటిచెప్పాడు. బిజెపి నేతలు అంబేద్కర్ విగ్రహాలకు దండలు వేస్తూనే ఆచరణలో అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు. నేడు ఫెడరల్ స్ఫూర్తితో ఉన్న రాజ్యాంగ వ్యవస్థను రాష్ట్రాల అధికారాలను కుదించి కేంద్రం చెప్పుచేతల్లో ఉంచుకొని రాష్ట్రాల అధికారాలను, నిధులపై పెత్తనం చేస్తున్నారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే పన్ను (జి.ఎస్.టి), ఒకే విద్యా విధానం పేరుతో భిన్నత్వంలో ఏకత్వాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆర్.ఎస్.ఎస్ అడుగు జాడల్లో నడుస్తూ కార్పొరేట్-హిందూత్వ విధానాలను ఆచరిస్తూ రాజ్యాంగ లౌకిక స్వభావానికి తూట్లు పొడుస్తున్నారు. లౌకికవాదులు, ప్రజాతంత్ర వాదులందరు బిజెపి అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే మన దేశ సమైక్యతను నిలుపుకోగల్గుతాం. సామాజిక న్యాయాన్ని కాపాడుకో గలుగుతాం.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు మనం అర్పించే ఘనమైన నివాళి ఇదే.
దడాల సుబ్బారావు / వ్యాసకర్త : ఎ.పి వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు /










