Jul 16,2021 19:36

వాషింగ్టన్‌ : సాధారణంగా మనం ఒక్క పామును చూస్తేనే హడలెత్తిపోతాం. అలాంటిది ఏకంగా 18 పాములను ఒకేసారి చూస్తే.. అది కూడా మనం నిద్రపోయే బెడ్‌ కిందే ఉంటే.. గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇటువంటి సంఘటనే జార్జియాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ట్రిన్‌ విల్చర్‌ అనే మహిళ రాత్రి సమయంలో.. తన బెడ్‌ రూమ్‌లో నిద్రపోయే ముందు బెడ్‌ను సర్దుతున్న సమయంలో నేలపై ఏదో శబ్ధం వినిపించింది. ఆ వినికిడికి ఆమె బెడ్‌ని ఎత్తిచూడగా.. మహిళకు పాము కనిపించింది. దీంతో ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. వెంటనే ఆమె భర్త రూమ్‌ లోపలకి వచ్చి చూడగా తనకి పాముతోపాటు.. పాము పిల్లలు కూడా కనిపించాయి. దీంతో అసలు ఇంకెన్ని ఉన్నాయోనన్న సందేహం వచ్చి పరిశీలనగా చూడగా ఏకంగా 18 పాములు కనిపించాయి. ఈ మొత్తం పాములను వారు ఓ సంచిలో వేసి సమీపంలో ఉన్న అడవిలో వదిలేశారు. ఈ సమాచారం అందుకున్న స్నేక్‌ రెస్క్యూ టీమ్‌ ఆ ఇల్లంతా గాలించింది. ఇక ఎక్కడా పాములు లేవని రెస్క్యూటీమ్‌ చెప్పడంతో.. ఆ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ట్రిన్‌ విల్చర్‌ మాట్లాడుతూ.. 'అసలిన్ని పాములు మా గదిలోకి ఎలా వచ్చాయో అర్థం కాలేదు' అని అన్నారు. ఆమె దీనికి సంబంధించిన ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.