ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్ సమస్యలు పరిష్కరించనప్పుడు కౌన్సిల్ సమావేశాలు ఎందుకని.. టిడిపి ఫ్లోర్ లీడర్, 20వ వార్డు కౌన్సిలర్ రత్నప్పచౌదరి అజెండా పేపర్లు చింపి వేస్తూ నిరసన తెలిపారు. అనంతరం సమావేశాన్ని వాకౌట్ చేశారు. ఛైర్మన్ తుంగ ఓబుళపతి అధ్యక్షతన శనివారం పుట్టపర్తి నగర పంచాయతీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్ప చౌదరి మాట్లాడుతూ తన వార్డు పరిధిలోని పెద్ద కమలవారిపల్లిలో మోకాలు లోతు గుంతలు పడి ద్విచక్ర వాహనాలు కూడా పోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వీధిలైట్లు వేయలేదన్నారు. తాగునీటి మోటర్లు చెడిపోయినాయని, కనీసం ఎవరైనా చనిపోతే శ్మశాన వాటిక లేదన్నారు. ఆయా సమస్యలను ఎన్నిసార్లు కౌన్సిల్ దృష్టికి తెచ్చినా ఫలితం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా టిడిపి వార్డులపై వివక్ష చూపుతున్నారని వాపోయారు. అనంతరం వాక్ అవుట్ చేసి వెళ్లిపోయారు. తర్వాత కౌన్సిలర్ చెరువు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ శ్మశానానికి 3 ఎకరాలు నెల క్రితమే ఎమ్మెల్యే కేటాయించారన్నారు. కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రహదారి నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరైందని, త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. బోరు వేయాలంటే గ్రామం చుట్టూ చెరువు నీరు ఉందని తగ్గిన వెంటనే వేస్తామన్నారు. కౌన్సిలర్లు సాయి గీత, సూర్యగౌడ్ మాట్లాడుతూ పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలని. వీధిలైట్లు వేయించాలని కోరారు. వైస్‌ఛైర్మన్ తిప్పన్న, చెరువు భాస్కర్ రెడ్డి దోమల నివారణకు పాగింగ్ చేయాలన్నారు.
కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు










