రెండు రోజుల క్రితం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించక పోగా పరోక్షంగా సమస్యల తీవ్రతను మరింత పెంచింది. ఇరువురు ముఖ్యమంత్రులు కలహించుకొని జుట్టు కేంద్ర ప్రభుత్వం చేతికి ఇచ్చారు. వాస్తవం చెప్పాలంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం సాధించింది ఇదొక్కటే. కాగా కృష్ణ, గోదావరి నదీ జలాల పంపిణీపై ట్రిబ్యునళ్లు వేసేందుకు తీసుకున్న నిర్ణయం సమస్యలను నానబెట్టడం, మున్ముందు తగాదాలకు ఆజ్యం పోయడం తప్ప వెంటనే సమస్యల పరిష్కారం నోచుకోదు.
ముందుగా కృష్ణా నదీ జలాల సమస్య పరిశీలి ద్దాం. 2019 ఎన్నికల తర్వాత కౌగలింతల్లో వుండిన ఇరువురు ముఖ్యమంత్రులకు ఎక్కడ చెడిందో ఏమోగాని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు రెండు పథకాలు ప్రకటించడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కస్సుబుస్సుమన్నారు. అక్కడి నుండి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ సంద ర్భంలో ఒక అంశం చెప్పాలి. ఎ.పి, తెలంగాణ ముఖ్యమంత్రుల అంశంలోనే కాదు. ఏ రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రుల మధ్య రాజకీయ మైత్రి, సామరస్యం తప్పని సరి. అది నేడు కొరవడి రెండు రాష్ట్రాల మధ్య ఉప్పు నిప్పుగా మారింది. ఫలితం గా అటు దక్షిణ తెలంగాణ ఇటు రాయల సీమ ప్రాంతాల్లో అసంతృప్తికి దారి తీసింది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత నెలకొన్న పరిస్థితి పరిశీలిస్తే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు ఇప్పట్లో మొదలు పెట్టే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ లు సమర్పించితే కేంద్ర జల సంఘం సాంకేతిక అంశాలు పరిశీలించి ఆమోదం తెలిపితే తదుపరి జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆమోద ముద్ర వేసిన తర్వాత గాని మోక్షం కలుగదు. ఒక విధంగా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి ఇబ్బంది కరమైన పరిస్థితి.
ఈ అంశంలో ముఖ్యమంత్రి మరింత ముందు జాగ్రత్త తీసుకొని వుంటే బాగుండేది. గత ఏడాది అక్టోబర్‌లో కర్నూలు జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనల్లో ఈ పథకం ముచ్చుమర్రి నుండి ప్రతిపాదించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ముచ్చుమర్రి ఎత్తిపోతలు పథకం వున్నందున దాని విస్తరణ తప్ప కొత్త పద ¸కం కాదని తెలంగాణ లాగా చెప్పుకొనే అవకాశం వుండేది. ఇది మైనస్ పాయింట్ అయింది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలు అమలు జరిగితే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుంది. దాదాపు 35 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో వున్న పాలమూరు, దిండి రెండు ఎత్తిపోతల పథకాలు కొత్తవిగా ముద్ర పడింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంత కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదలు పెట్టామనే వాదనకు తెర పడింది. ఈ పరిస్థితుల్లో డిపిఆర్ సమర్పించి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆమోదం పొందవలసి వుంది. మరి అంత వరకు ఈ పథకాల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం నిలుపుదల చేస్తుందా? ఈ అంశంలో ముఖ్య మంత్రి కెసిఆర్ ఒక వాదనను తొలి నుండి రిజర్వులో వంచుకొని వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన పథకాలకు కొద్ది మార్పులు చేశామని చెబుతున్నారు. ఈ దృష్ట్యా పాలమూరు, దిండి కొత్త పథకాలు కావని, పాత పథకాలని నిర్మాణం ఆపకపోవచ్చు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్త రణ పనులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎలా స్పందిస్తుంది? గతంలోనే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి జారీ చేసిన ఆదేశాలను ఏ రాష్ట్రం అమలు జరపలేదు.
అయితే కృష్ణా నదీ జలాల పంపిణీకి, తిరిగి ట్రిబ్యునల్ విచారణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంగీకరించడం సరికాదు. అధికారు లు, సలహాదారు సరైన సమాచారం ఇచ్చినట్లు లేదు. ఎందుకంటే ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అమలులో వుంది. తిరిగి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కూడా వచ్చి సుప్రీంకోర్టు స్టే తో నోటిఫై చేయలేదు. పైగా ఈ రోజు ఏ అంశాలైతే ముఖ్యమంత్రి కెసిఆర్ లేవనెత్తుతున్నారో అవన్నీ కూడా 18 అంశాలు విచారణాశంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం చేర్చి వుంది. తిరిగి విచారణ కోరడమంటే ముఖ్యమంత్రి కెసిఆర్ బహుముఖంగా వ్యవహరించడమే. ఈ అంశా లను అపెక్స్ కౌన్సిల్ ముందు మన అధికారులు వుంచినట్లు లేదు.
ఇకపోతే గోదావరి నదీ జలాల పంపిణీకి ట్రిబ్యునల్ వేసేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎవరి వాటా ఎంత అనే అంశంపై ఏకీభావం లేదు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు ఇప్పుడు నిర్మాణంలో వున్న ప్రాజెక్టులను తెలంగాణ నిలుపుదల చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం ఇటీవల కేంద జల సంఘం రెండు టిఎంసిల ఎత్తిపోతలకు 160 టియంసిలు సామర్థ్యానికి అనుమతి వుంది. ఇప్పుడు డిపిఆర్ పంపి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆమోదించే వరకు విస్తరణ పనులు నిలుపుదల చేస్తారా? అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్ రాజశేఖర రెడ్డి హయాంలో దుమ్ముగూడెం సాగర్ టెయిల్ పాండ్ పథకం ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన తదుపరి అది సీతారాముల ఎత్తిపోతల పథకంగా మార్పు చేయబడి నిర్మాణంలో వుంది. తుపాకులగూడెం ఇంకా ఒకటి రెండు పథకాలు ఈ కోవకు చెందినవే. ఈ పథకాలు వేటికి కేంద్ర జల సంఘం వద్ద సాంకేతిక అనుమతులు లేవు. అయితే పాత పథకాలకే కొద్ది మార్పులు చేసి అమలు చేస్తున్నామని ఏవీ కొత్తవి కావనే వాదన కెసిఆర్ చేస్తున్నారు. కాబట్టి వీటి నిర్మాణం నిలుపుదల చేసే అవకాశాలు వుండవేమో. ఇప్పుడు అసలు సమస్య ఇది కాదు. గోదావరి జలాల్లో ఎవరి వాటా ఎంతో తేలకుండా పరస్పరం వాదులాడుకుంటున్న పూర్వ రంగంలో...నీటి వాటాలు తేల్చేందుకే ప్రస్తుతం ట్రిబ్యునల్ నియమించబోతున్నారు.
2004లో నియమింప బడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తన తుది తీర్పు 2013లో సమర్పించింది. ఈ ట్రిబ్యునల్ మాత్రమే కాదు. దేశంలో పని చేస్తున్న ట్రిబ్యునళ్లు త్వరగా అవార్డులు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత ట్రిబ్యునళ్లు వేసేందుకు చట్టమైతే చేసిందిగాని అడుగు ముందుకు పడటం లేదు.
ఈ నేపథ్యంలో గోదావరిపై నియ మింపబడే ట్రిబ్యునల్ ఎప్పుడు తీర్పు ఇస్తుందో అంత వరకు నిర్మాణంలో వున్న ప్రాజెక్టుల నిర్మాణం నిలుపుదల చేస్తారా? ఒక వేళ ఎవరికి వారు నిర్మాణంలో వున్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే ట్రిబ్యునల్ తీర్పు విరుద్ధంగా వస్తే ఏం జరుగుతుంది? ఇదంతా పరిశీలించితే సమస్య జటిలమైందని అర్ధం అవుతోంది. రెండు రాష్ట్రాలూ బాధ్యతగా వ్యవహరించి ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయడం మంచిది.
(వ్యాసకర్త విశ్రాంత పాత్రికేయులు,
సెల్ : 9848394013)










