నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది యువత ధరిస్తున్న టీషర్టులు, టోపీలపై మెరిసే చిత్రం చే గువేరాది. ఆయన జీవిత విశేషాలను, సిద్ధాంతాలను, ఆచరణను యువతరం తప్పక తెలుసుకోవాలి. ఆయన జీవితం, బోధనలు నేటి తరానికి కూడా నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
ఎర్నెస్టో చే గువేరా అంతర్జాతీయవాది. గొప్ప మానవతావాది. జీవితపు చివరి క్షణం వరకూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాడు. 'చే' జీవితం అంటేనే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం. క్యూబా విప్లవోద్యమ నేత ఆయన. 1928లో అర్జెంటీనా దేశంలో ఎర్నెస్టో గువేరా డీలాసెర్నా జన్మించాడు. ఆ దేశస్తులు ముద్దుగా పిలిచే 'చే' పేరు ఆయనకు స్థిరపడింది.
లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికా పాలకులు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి నియంతలను ప్రోత్సహించడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలైనా తన చెప్పుచేతల్లో ఉండలేదని వాటిని కూలదోయడం సర్వ సాధారణంగా మారింది. అమెరికా పాలకులు ప్రజల మూలుగలను పీల్చి పిప్పిచేసి, ఆ దేశాల్లోని వనరులను దోచుకుని, వారి సామాజిక జీవితాన్ని కొల్లగొట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం వలస దేశాల్లో తిరుగుబాట్లు, విప్లవాలు ఎగిసిపడి సామ్రాజ్యవాదులను ఆత్మరక్షణ లోకి నెట్టివేస్తున్న కాలం అది.
చే గువేరా 1953లో వైద్య విద్యను పూర్తిచేశాడు. ఆస్తమా పేషెంట్ అయిన 'చే' మొదటి నుంచీ డాక్టర్ కావాలనీ, ఆ రంగంలో గొప్ప పరిశోధకునిగా కృషి చేసి మానవాళికి మహోపకారం చేసే ఆవిష్కరణలను కనుగొనాలని కలలుగన్నాడు. లాటిన్ అమెరికా దేశాలన్నీ పర్యటించాడు. అమెరికా గూఢచారి సంస్థ (సిఐఎ) గ్వాటెమాలా ప్రభుత్వాన్ని కుట్రతో కూలదోయడాన్ని ఆ దేశంలో ప్రత్యక్షంగా చూశాడు. అక్కడి నుంచి మెక్సికో సిటీ వెళ్ళాడు. జైలు నుంచి విడుదలై అక్కడకు చేరుకున్న ఫైడల్ కాస్ట్రోను కలుసుకున్నాడు. మార్క్సిజం అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అర్థశాస్త్ర విద్యార్థిని హిల్టాగాడియాను వివాహమాడాడు.
'ప్రపంచంలో ఎక్కడ, ఎవ్వరికి అన్యాయం జరిగినా తీవ్రంగా ప్రతిస్పందించగలగాలి. ఒక విప్లవకారుడికి ఉండాల్సిన కనీస లక్షణం ఇది' అని చే ప్రకటించాడు. బాటిస్టా నియంత పరిపాలనకు వ్యతిరేకంగా క్యూబా విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన ఫైడల్ కాస్ట్రోకు చే గువేరా, రావుల్ కాస్ట్రో ప్రధాన సహచరులు. 1959 జనవరి 1న క్యూబా విప్లవం విజయవంతమైంది. ఫైడల్ కాస్ట్రో నాయకత్వాన ఏర్పడిన విప్లవ ప్రభుత్వంలో 'చే' పలు కీలక బాధ్యతలు నిర్వహించాడు. క్యూబా ప్రభుత్వం తరఫున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించాడు. సోవియట్, చైనా, భారత్, ఆఫ్రికా దేశాలలో పర్యటించాడు. జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా, కేంద్ర ప్రణాళికా సంఘం డైరెక్టరుగా, పరిశ్రమల శాఖా మంత్రిగా, రక్షణ కేంద్రాల అధిపతిగా, రాజకీయ, ఆర్థిక, మైత్రీ బృందాల సభ్యునిగా ఆయనకు అప్పగించిన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని కాస్ట్రో ఎంతగానో ప్రశంసించాడు.
'సామ్రాజ్యవాదంపై ఏ దేశం విజయం సాధించినా అది మన విజయమే. ఏ దేశం ఓడినా అది మన ఓటమే. సామ్రాజ్యవాదంపై పోరులో తృతీయ ప్రపంచ దేశాల మధ్య పొత్తు అనివార్యం, ఆవశ్యకం' అనేది 'చే' భావన. అంతర్జాతీయత ఇందుకు దన్నుగా నిలవాలంటాడు. అందుకే క్యూబా విప్లవం జయప్రదం కావడంతోనే చే గువేరా సంతృప్తి చెందలేదు. ఆయన చూపు ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో జరుగుతున్న విముక్తి ఉద్యమాలపై పడింది. 1965లో క్యూబా వదిలి వెళ్ళారు. ఆఫ్రికా ఖండం లోని కాంగోలో చాలా మాసాలుండి అక్కడి నుంచి అమెరికాకు తొత్తుగా ఉన్న బొలీవియా నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా దళాన్ని నడిపించారు. 1967 అక్టోబర్ 8న అమెరికా ఆధ్వర్యంలోని బొలీవియా కిరాయి దళాలు ఆయనను బంధించాయి. మరుసటి రోజే కిరాతకంగా హత్య చేశాయి. 'చే', ఆయన సహచరుల భౌతికకాయాలను ప్రపంచానికి తెలియకుండా ఖననం చేశారు.
'చే' ను హత్య చేసిన సిఐఎ...ఫైడల్ కాస్ట్రోపై కూడా సుమారు ఆరు వందల సార్లకు పైగా నేటి వరకూ హత్యా ప్రయత్నాలు చేసింది. సామ్రాజ్యవాద దేశాల నాయకుడుగా ఉన్న అమెరికా మానవత్వానికి, శాంతికి, ప్రజాస్వామ్యానికి శత్రువుగా నిలిచిందని దానికి వ్యతిరేకంగా చివరి వరకూ పోరాడారు 'చే'. అందుకే లాటిన్ అమెరికా దేశాల ప్రజలు చేగువేరాను మా నాయకుడు అని చాటుకుంటున్నారు. బొలివార్, ఒర్టేగాలను కూడా తమ ఆత్మగౌరవానికి ఈ దేశాల ప్రజలు గుర్తుగా చూసుకుంటున్నారు. చే గువేరాను పొట్టనబెట్టుకున్న అమెరికా, సిఐఎలే చిలీలో ప్రజలెన్నుకొన్న వామపక్ష ప్రభుత్వ నేత సాల్వడార్ అలెండీని హత్య చేశాయి. వియత్నాంపై దాడి చేసి రెండవ ప్రపంచ యుద్ధంలో వాడినన్ని ఆయుధాలను, రసాయనిక ఆయుధాలను ఆ దేశంపై ప్రయోగించినా వారి చేతిలో అమెరికా చావుదెబ్బతిన్నది. భారతదేశంపై అది పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. క్యూబా దేశంపై ఆర్థిక దిగ్బంధనం విధించి ఏ దేశం కూడా వారితో వ్యాపార, ఆర్థిక లావాదేవీలను పెట్టుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించింది. ఆ ఆంక్షలను పలు రూపాల్లో నేటికీ అమలు చేస్తూనే ఉంది. నేడు అమెరికా తను ఎదుర్కొంటున్న సంక్షోభం దుష్ఫలితాలను భారత్ లాంటి పేద దేశాల ప్రజలపై నెట్టడానికి ప్రపంచీకరణను వాడుకోవడం చూస్తున్నాము.
చే గువేరా తన కుటుంబాన్ని వదిలి వెళ్ళినా తను జీవించి ఉన్న కాలంలో తన కుటుంబ సభ్యులకు రాసిన అనేక లేఖలను, ప్రభుత్వాన్ని నడిపినపుడు చేసిన అనేక ప్రసంగాలను, ఆలోచనలను హవానా లోని జోస్‌మార్టి ప్రచురణ కేంద్రం, చే గువేరా స్టడీస్ సెంటర్ అనేక ప్రచురణలుగా వెలువరించాయి. 'చే' బొలీవియా పోరాటంలో ఉండి కూడా తన కుటుంబ సభ్యులు-భార్య, కుమార్తె, కుమారుడికి రాసిన లేఖలు, తల్లిదండ్రులకు రాసిన లేఖల ద్వారా ఆయన తన మార్గం యొక్క విశిష్టతను వివరించారు. పెద్ద కుమార్తె హిల్టిడాకు పదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి రాసిన లేఖలో 'నేను మీకు చాలా దూరంలో ఉన్నాను. మన శతృవుపై పోరాటం చేస్తున్నాను. అదేమంత గొప్ప విషయం కాదు. ఏదో నాకు చేతనైనంత చేస్తున్నాను. నేను మీ గురించి గర్వపడుతున్నట్లుగానే, మీరు కూడా నా గురించి గర్వించవచ్చు. నీ క్లాసులో నీవు సాధ్యమైనంత ముందుండేం దుకు ప్రయత్నించాలి. అన్నింటిలోనూ ఉత్తమంగా ఉండాలి. అంటే అధ్యయనం, విప్లవకర దృక్పథం, ఆషామాషీగా ఉండక పోవడం, విప్లవాన్ని ప్రేమించడం, కామ్రేడ్లీతత్వం' అని రాశారు.
పిల్లలందరికీ, భార్యకు కలిపి రాసిన లేఖలో కుమారుడు టాటికోను ఉద్దేశించి 'టాటికో...నీవు ఉత్తమ పురుషునిగా పెరగాలి. నీవు ఎలా తయారయ్యావో మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు చూస్తాను. సామ్రాజ్యవాదం ఉన్నంత వరకూ దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. అది ఓడించబడిన తర్వాతనే మీరు, నేను చందమామ మీద ఆనందంగా సెలవులను గడుపుదాం' అని రాశాడు. తల్లిదండ్రులకు రాసిన లేఖలో 'నా మార్క్సిజం మరింత వేళ్ళూనుకున్నది. మరింత పరిశుద్ధంగా తయారైంది. నేను సత్యమని నమ్మిన దాన్ని నిరూపించడం కోసం ఏ కష్టానికైనా సిద్ధపడినవాడిని. నేను మీకు రాస్తున్న లేఖ ఇదే చివరిది కావచ్చు. అలా కావాలని నేను అనుకోవడంలేదు. కానీ అన్ని అంశాలనూ పరిగణన లోనికి తీసుకుంటే అదే జరుగుతుందని అనిపిస్తున్నది' అని పేర్కొన్నాడు. ఇది రాసిన రెండేళ్ళలోపే 'చే' హత్యకు గురయ్యాడు.
సామ్రాజ్యవాదం బతికి ఉన్నంత కాలం యుద్ధాలు ఉంటాయంటారు 'చే'. యుద్ధం అంటేనే అక్కడ ఉన్న సంపద పైన కన్నేయడం. మార్క్జిజం-లెనినిజంను అధ్యయనం చేసిన 'చే' 'పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ సామ్రాజ్యవాదం' అన్న లెనిన్ సూత్రీకరణను, 'పెట్టుబడిదారీ విధానం చివరకు గత్యంతరంలేని స్థితిలో ఎంచుకొన్న విధానమే సామ్రాజ్యవాదం' అన్న విశ్లేషణను సరిగానే అర్థం చేసుకున్నాడు. నేడు పెట్టుబడిదారీ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేస్తున్నది. దీని ఫలితంగా ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రపంచీకరణ ప్రభావం లాటిన్ అమెరికా దేశాల్లో ముందుగానే వచ్చింది. బ్రెజిల్, బొలీవియా, వెనిజులా లోని శ్రామికవర్గం ప్రపంచ బ్యాంకు విధానాలకు చరమగీతం పాడింది. ఫలితంగా అక్కడ వామపక్ష ప్రభుత్వాలు నెలకొల్పబడ్డాయి. చేగువేరా, కాస్ట్రోల స్ఫూర్తితో చావేజ్ లాంటి నేత వెనిజులాలో అమెరికాను ఎదిరించి, తన దేశ ప్రజల పక్షాన నిలబడ్డారు. పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకమైన ప్రత్యామ్నాయాలను రూపొందించటంలో ప్రపంచానికే మార్గదర్శి అయ్యారు.
'చే' ఎదిరించి పోరాడిన సామ్రాజ్యవాదం ప్రస్తుతం 'ప్రపంచీకరణ' దశలో అడుగు పెట్టింది. వర్ధమాన దేశాల వనరులను, ప్రజలను మరింత వేగంగా లూటీ చేస్తున్న స్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నేటి యువతీయువకులు 'సామ్రాజ్యవాద ప్రపంచీకరణ'కు వ్యతిరేకంగా పోరాడటమే చే గువేరాకు అర్పించే నిజమైన నివాళి.
(వ్యాసకర్త తెలంగాణ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు)










