- దళితవాడల్లోనే అధికం
- పాలకులు మారినా రాతమారని దళితవాడలు:
ప్రజాశక్తి - రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండలంలో వర్షం పడితే చాలు బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆవాస ప్రాంతాలలో రోడ్లు అద్వానంగా తయారవుతున్నాయి. చినుకు పడితే చిత్తడే అనే విధంగా అంతర్గత రహదారులు తయారయ్యి కనీసం నడవడానికి వీలు లేని విధంగా రాకపోకలకు ఇబ్బందికరంగా మారిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలలో నీరు నిల్వ ఉండి, బురద మయంగా మారి దోమలు నివాసానికి అత్యంత యోగ్యమైనదిగా తయారయ్యి, ప్రజలకు చాలా ఇబ్బందిగా మారాయి.
- పాలకులు మారినా రాతమారని దళితవాడలు :
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సరే దళిత వాడలు బిసి బలహీన వర్గాల ఆవాస ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు వెనకాడటం రివాజుగా మారినట్లుగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పాలకుల హయాంలో ఆగిపోయిన సిమెంట్ రోడ్లను నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వమైనా పూర్తి చేస్తున్నదేమో అని ఆశపడిన వారికి నిరాశ ఎదురౌతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ ఆగిపోయిన సిమెంట్ రోడ్లను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో దళితవాడ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవకాశాలు ఉండి కూడాను నాయకులు, అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి, మండలంలోని దళిత వాడల్లో మిగిలిపోయిన సిమెంటు రోడ్లను పూర్తి చేసేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.










