Nov 28,2022 21:18

సున్నా వడ్డీ, పంట నష్టపరిహారం చెక్కులను అందిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌

       పుట్టపర్తి అర్బన్‌ : వైఎస్సాఆర్‌ సున్నా వడ్డీ పథకం జిల్లాలోని రైతులకు 26.86 కోట్ల లబ్ధి చేకూరుందని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలియజేశారు. జిల్లా స్థాయి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్‌ గిరిజమ్మ, హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్‌, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, జిల్లా వ్యవసాయ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ రమణారెడ్డి, కలెక్టర బసంత్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తోందని చెప్పారు. అందులో భాగంగా సున్నా వడ్డీ కింద రబీ 2020-21, ఖరీఫ్‌ 2021 సీజన్లో 1.30లక్షల మంది రైతులకు రూ.25.43కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్లో అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన 1861 మంది రైతులకు రూ.1.43 కోట్లు విడుదల అయ్యాయన్నారు. 389 భరోసా కేంద్రాలకు ప్రభుత్వ భవనాలను జనవరి నెల ఆఖరిలోగా పూర్తి చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా 2.68లక్షల మంది రైతులకు రూ.308 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రమణారెడ్డి , వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.