Jul 09,2021 07:50

ప్రజాశక్తి-న్యూడిల్లీ బ్యూరో : కోవిడ్‌-19కు సంబంధించి రూ.23,123 కోట్లతో రెండో అత్యవసర ప్యాకేజీని కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. ఆసుపత్రుల్లో 20 వేల అదనపు ఐసియు బెడ్లు, కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన ఒకరోజు తర్వాత ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్‌ గురువారం మొదటిసారిగా భేటీ అయింది. ఈ సందర్భంగా కోవిడ్‌-19 రెండో దశ ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం తెలి పింది. ఈనెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలు కానున్న ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులు ఖర్చు చేస్తా యని ప్రభుత్వం పేర్కొంది. రూ.23 వేల కోట్లలో రూ.15 వేల కోట్లను కేంద్రం ఖర్చు చేయ నుండగా, రాష్ట్రాల వాటా రూ.8 వేల కోట్లు అని తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మన్‌సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ 736 జిల్లాల్లో పిల్లల చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టెలీ మెడిసిన్‌ ద్వారా వైద్యానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ ఎపిఎంసిలను (మండిలు) మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆత్మనిర్భర భారత్‌ ప్యాకేజీ కింద మండీలకు లక్ష కోట్లను కేటాయిస్తున్నా మని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తోమర్‌ తెలిపారు. దేశ వ్యవసాయ రంగంలో కొబ్బరి సాగు కీలక పాత్ర పోషిస్తోందని, అందుకే కోకోనట్‌ బోర్డు యాక్ట్‌ను సవరిస్తున్నామని ప్రకటించారు. కొబ్బరి బోర్డుకు అధికారులు ఉండరని, వారి స్థానంలో వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చేవారు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారని పేర్కొన్నారు. ఈ బోర్డులో ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలను సభ్యులుగా చేరుస్తున్నామని తోమర్‌ ప్రకటించారు.