Jan 25,2023 22:04

కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన

సోమందేపల్లి : చెక్కెర, సిగరెట్ల హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తున్నానంటూ ప్రజలను నమ్మబలికాడు. రెండు లక్షల డెబ్భై వేల రూపాయలు కడితే రోజుకు రూ. 4 వేలు చొప్పున 4 సంవత్సరాలపాటు ఇస్తానని చెప్పడంతో ఆశ పడ్డ కొందరు లక్షలాది రూపాయలు అతనికి ఇచ్చారు. నెలరోజులపాటు నమ్మకంగా ఇవ్వడంతో మరికొంతమంది ఎవరికి తెలియకుండా మరింత ఇచ్చారు. నెలరోజులలో దాదాపుగా రూ.4 కోట్లు వసూలు చేసుకొని ఉడాయించిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకొంది. బాధితుల కథనం మేరకు ఎక్కడ నుండో వచ్చిన మనోహర్‌ రెడ్డి అనే వ్యక్తి నెలరోజుల క్రితం సోమందేపల్లి గ్రామంలోని వాల్మీకి విగ్రహం దగ్గర ఒక దుకాణంలో చెక్కెర, సిగరెట్ల వ్యాపారం ప్రారంభించాడు. తాను చెక్కెర, సిగరెట్ల వ్యాపారం చేస్తున్నానని, ప్రతిరోజూ వేలాది టన్నుల చెక్కెర, వందలాది బండల్‌ సిగరెట్లు అమ్ముతున్నానని చెప్పాడు. తనతో పాటు ఎవరైనా చేరడానికి అవకాశం ఉందని, రూ. 2.70 లక్షలు కడితే నెలకు రూ.4 వేలు చొప్పున ఇస్తానని నమ్మబలికాడు. అలా కొంతమందికి ఇచ్చాడు. దీంతో చాలామంది ఆశపడి అప్పులు చేసి మనోహర్‌ రెడ్డి అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. తామే కాకుండా తమ బంధువులతో కూడా డబ్బులు కట్టించారు. ఆలా దాదాపుగా రూ. 4 కోట్ల వరకు మనోహర్‌రెడ్డి వసూలు చేసినట్లు సమాచారం. కొందరికి అనుమానం వచ్చి డబ్బులు వెనక్కి ఇమ్మని అడగడంతో కొందరికి ఇచ్చాడు. మిగిలిన వారు ఎక్కడ అడుగుతారో అని మంగళవారం రాత్రి దుకాణం ఎత్తేసాడు. బుధవారం ఉదయాన్నే అనుమానం వచ్చి వెళ్లి చూడగా దుకాణానికి తాళం వేసి ఉంది. ఇంటికి తాళం వేయడంతో ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. అప్పులు చేసి డబ్బులు కట్టామని కొందరు బంగారు బ్యాంకులో బంగారు ఉంచి తెచ్చి ఇచ్చామని వాపోయారు. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా ఇందులో ఉన్నారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తెలిసినా కూడా ఎలా మోసపోతున్నారో అర్థం కావడం లేదని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు ఎస్‌ఐ విజరు కుమార్‌ మనోహర్‌రెడ్డి ఉన్న కార్యాలయాన్ని బాదితులతో కలిసి తనిఖీ చేశారు.