రాజంపేట అర్బన్
సమయం విలువైనదే కానీ..ప్రాణం అంతకంటే విలువైందని తెలియజేస్తూ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదాలపై పోస్టర్ ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ఎజిఎం రమణయ్య, ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకే పది అంశాలతో కూడిన పోస్టర్‌ను రూపొందించారన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సిగల్స్‌పై, వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు చిత్రాల ద్వారా తెలియపరిచారని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, హెల్మెట్, సీటుబెల్ట్ తప్పసరిగా ధరించాలని, అధిక వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని విద్యార్థులు చిత్రాల ద్వారా చక్కగా అవగాహన కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










