Nov 29,2022 21:52

నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వేసిన ప్యాచ్‌

ప్రజాశక్తి మడకశిర : ఇటీవల కురిసిన వర్షాల ధాటికి ప్రధాన రహదారులన్ని దెబ్బతిని అడుగుకో గుంత ఏర్పడ్డాయి. అరకిలో మీటరు దూరం ఆరగంట సేపు ప్రయాణించే దుర్బర స్థితికి రహదారులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానరహదారిలో ఏర్పడిన గుంతలను పూడ్చే పేరుతో గుత్తేదారులు, సంబందిత అధికారులు నయాదందాకు తెరలేపారన్న ఆరోపణలు వినపడుతున్నాయిజ ప్రభుత్వం రహదారుల నిర్వహణ కింద లక్షలాది రూపాయలు నిధులు కేటాయించి విడుదల చేసింది. పనులు మంజూరు అయ్యిందే తడువుగా సంబంధిత గుత్తేదారుడు ఆఘమేఘాల మీద పనులు ప్రారంభించాడు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషించారు. అయితే గుంతలు పూడ్చేపేరుతో గుత్తేదారుడు అక్రమాలకు తెరలేపాడని ప్రజలు విమర్శిస్తున్నారు. తూతూ మంత్రంగా పనులు చేసుకుంటూ వెళుతున్నాడు. నిబందనల ప్రకారం రోడ్డుపై పడిన గుంతలను పూడ్చేటప్పుడు వెట్‌మిక్స్‌ వేసిన తర్వాత వైబ్రేటర్‌ రోలర్‌ ద్వారా రోలింగ్‌ చేయాలి. అవసరమైతే బిఎం. బిసి కంకర ను వేసిన అనంతరం తారువేసి రోలింగ్‌ చేయాల్సిఉంది. అయితే గుత్తేదారుడు ఆ గుంతలను శుభ్రం చేయకుండా మట్టి రోడ్డు పైనే నామమాత్రంగా తారు వేసి మమ అనిపిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి చేస్తున్న ఈ ప్యాచ్‌ వర్క్‌ ఎన్నిరోజులు ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులపై సంబందిత అధికారుల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉందన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు, గుత్తేదారుడు కుమ్మక్కై పనులను నాశిరకంగా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బక్తరపల్లి జాతర నేపథ్యంలో కోర్టు వద్దనుండి పది కిలోమీటర్ల దూరం ఈ అతుకులను వేయడానికి అధికారులు పనులు చేపట్టారు. ఇందులో మూడు కిలోమీటర్లు కొత్తగా తారు రోడ్డు నిర్మించిన నేపథ్యంలో ఇక మిగిలిన ఏడు కిలోమీటర్ల మేర పనులు చేపట్టడానికి రూ.1.10 లక్షల నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఎంతమేర నిధులు విడుదల అయిందన్న విషయాన్ని బహిర్గంతం చేయడంలో కూడా ఆ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు అస్పష్ట సమాధానాలు ఇవ్వటంపై కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా పనులు జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
వివరణ : ప్యాచ్‌ వర్క్‌కు సంబందించి రోడ్లు భవనాల శాఖ డిఇ శ్రీనివాసులును వివరణ కోరగా ఈ గతుకుల రోడ్డును పూడ్చడానికి లక్ష పదివేల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు, ప్రస్తుతం జరుగుతున్న పనుల నాణ్యత గురించి ప్రస్తావించగా అలాంటిది ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.