- ఆన్‌లైన్ అసెస్మెంట్ చేయడంతో చెల్లింపులు తప్పనిసరి
- బలవంతంగా వసూలు చేస్తున్న అధికారులు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : పట్టణాల్లో అమలు చేస్తోన్న చెత్తపన్ను నుంచి ఇక ఎవరూ తప్పించుకోలేరు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్స్‌కు సైతం ఈ పన్నును మెలిక పెట్టారు. అంతేకాకుండా ఆస్తి పన్ను చెల్లించే అసెస్‌మెంట్లతోనే చెత్తపన్ను వసూలయ్యేలా అధికారులు ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టారు. పట్టణాల్లో అత్యధిక మంది నిరుద్యోగ యువత చిన్నచిన్న వ్యాపారాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. వారిపై చెత్త పన్ను పిడుగులా మారింది. వ్యాపారాలు నిర్వహించుకోవాలంటే కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్సు తీసుకోవాల్సి ఉంది. ఏడాదికోమారు వీటిని రెన్యువల్స్ చేయించుకోవాలి. సాధారణంగా మార్చి నెలాఖరు నాటికి వ్యాపారులు రెన్యువల్స్ చేసుకోవాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతోపాటు రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో సుమారు 60 వేల మంది వరకూ వ్యాపారులు రెన్యువల్స్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుంటున్నారు. చెత్తపన్ను చెల్లించిన వారు మాత్రమే ఈ రెన్యువల్స్ చేసుకొనేలా ఆన్‌లైన్ పేమెంట్‌లో ఆప్షన్‌ను తీసుకొచ్చారు. గడిచిన ఏడాదిలో బకాయిలు మొత్తం కలిపి ఒకేసారి చెత్త పన్ను చెల్లించేలా ప్రతి వార్డు సచివాలయంలో క్లస్టర్ వారీగా ఇప్పటికే అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటి ఆధారంగా ముందుగా క్లస్టర్‌ను కంప్యూటర్‌లో ఓపెన్ చేస్తే కమర్షియల్, రెసిడెన్సియల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో అవసరమైన దానిని ఓపెన్ చేస్తే అందులో అసెస్‌మెంట్ నెంబరు వస్తుంది. అనంతరం ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి ఈ నెంబరును నమోదు చేస్తే చెత్త పన్నుకు సంబంధించిన బకాయిల వివరాలు కనిపిస్తాయి. ఈ చెత్త పన్నును చెల్లించిన తరువాతనే రెన్యువల్‌కు మార్గం సుగమం అవుతుంది. చెత్తపన్ను బకాయిలు చెల్లించకపోతే రెన్యువల్స్ ఆగిపోతున్నాయి. దీంతో, చేసేది లేక వ్యాపారులు చెత్త పన్ను బకాయిలను చెల్లిస్తున్నారు. ఫలితంగా చెత్త పన్ను చెల్లించని ఒక్కో వ్యాపారి లైసెన్స్ రెన్యువల్స్ కోసం ఈ ఏడాది అదనంగా ఆ వ్యాపార సంస్థను అనుసరించి కనిష్టంగా రూ.1,200 నుంచి గరిష్టంగా రూ.60 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విధానం వచ్చే ఏడాది నుంచి హౌస్ హోల్డర్లకు ఆస్తి పన్ను విషయంలో అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
- చెత్త పన్ను వసూలు ఇలా
రెస్టారెంట్లు, బార్లు, హోటళ్ల నుంచి నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 తోపుడు బళ్లు, ఫుట్‌పాత్‌లపై చిన్నతరహా వ్యాపారాలు చేసుకునేవారి నుంచి రూ.100 నుంచి రూ.300, లాడ్జ్జీలకు గదుల సంఖ్యను బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు, అన్ని రకాల రిటైల్ వ్యాపారుల నుంచి సగటున రూ.150, ప్రయివేటు కమర్షియల్ కాంప్లెక్స్‌లకు రూ.500 ఉంచి రూ.800, షాపింగ్ మాల్స్‌కు రూ.2 వేల వరకు, ప్రయివేటు హాస్టళ్లకు రూ.1,500 వరకు, సినిమా థియేటర్లకు రూ.1,000 వరకు, 40 పడకలలోపు హాస్పటళ్లకు రూ.2.500, ఆపైన వాటికి రూ.5 వేలు, క్లినికిల్ ల్యాబరేటరీలు నుంచి రూ.1000 నుంచి రూ.2 వేలు, ఫంక్షన్ హాళ్లు, ఎగ్జిబిషన్ సెంటర్‌లు, కల్యాణ మండపాల నుంచి చదరపు మీటర్ల ప్రకారం రూ.2,500, రూ.3,500, రూ.5,000 కింద మూడు కేటగిరీలుగా విభజించి అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు.










