న్యూఢిల్లీ : వైసిపి రెబెల్ ఎంపి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆ పార్టీ ఎంపిలు ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఓంబిర్లాకు విజయసాయిరెడ్డి ఇటీవల లేఖ కూడా రాశారు. తాజాగా నేడు వైసిపి ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భరత్ స్పీకర్‌ను మరోసారి కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామ పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను స్పీకర్‌కు అందజేశారు. వెంటనే ఆయనపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైసిపి టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామ పాల్పడుతున్నారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు అందించామని తెలిపారు. రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని నేడు మరోసారి కోరామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ నెల 19 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.










