వ్యవసాయ రంగంపై రాష్ట్ర శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అంటే, రైతుకు మేళ్లు చేయడానికి ఎంత దూరమైనా పోతానని, ఏమైనా చేస్తానని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వీరు ఈ మాటలు చెబుతున్న సమయం లోనే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు లోకి తీసుకు వచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తోంది. మోడీ ప్రభుత్వ నిర్బంధ చర్యలను అధిగమించి లక్షలాది మంది అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రం లోనూ కేంద్ర చట్టాల ప్రభావంతో సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదని, భవిష్యత్తులో ఇతర పంటలపైనా ఇదే తరహా ప్రభావం పడే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి అయినా ఈ విషయం అటు ముఖ్యమంత్రికి గానీ, ఇటు ప్రతిపక్షనేతకు గానీ పట్టలేదెందుకనో? దేశ వ్యాప్తంగా రైతాంగం తెలుపుతున్న నిరసనలు, రాష్ట్ర రైతుల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలు వారి ప్రసంగాల్లో ప్రస్తావనకు కూడా నోచుకోలేదెందుకనో? అన్నదాతల భవిష్యత్తును, దేశ ఆహార భద్రతను ప్రశ్నార్థకం చేసే ఇంత కీలకమైన అంశాన్ని విస్మరించిన వారు రైతుల కోసం పోరాటం చేస్తామనో, ఎంత దూరమైనా పోతామనో చెప్పినంత మాత్రాన నమ్మడం ఎలా?
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకు వచ్చిన చట్టాలపై ప్రభుత్వ వైఖరి ఏమిటంటూ పిడిఎఫ్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూటిగా జవాబియ్యలేక, దాటవేత వైఖరి అవలంబించారంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? వ్యవసాయం పైనా, రైతుల పైనా, వారి సంక్షేమం పైనా ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ తప్పించుకుని తిరిగే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఒకవైపు పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభ లోనే నిరంకుశ వ్యవసాయ చట్టాల పైనా, కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన విరుచుకు పడ్డారు. రైతులను నష్టపరిచే ఎటువంటి చట్టాలనూ తమ రాష్ట్రంలో అమలుచేసేది లేదని ప్రకటించారు. తెలంగాణ రైతులకు నష్టం కలిగించే చట్టాలు ఆంధ్రప్రదేశ్ రైతులకు మేలు చేస్తాయా? మరి, అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీగానీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీగానీ ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు?
రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు వాళ్ల ప్రయోజనాలు.. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం! రాజ్యాంగం ప్రకారం వ్యవసాయమన్నది రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం కదా! దీనిలోకి కేంద్ర ప్రభుత్వం ఎలా చొరబడుతుంది? ఇది సమాఖ్య వ్యవస్థ పైనా, రాష్ట్రాల హక్కుల పైనా దాడి చేయడమే కదా? కనీసం దానినైనా ఖండించవద్దా! అది కూడా చేయకుండా సాగిలపడటానికి 151 మంది సభ్యుల బలం దేనికి? దానిని పదే పదే ఘనంగా చెప్పుకున్నంత మాత్రాన ఒరిగేదేముంది? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం లోనే ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవం వంటి అంశాలున్నాయి కదా! ఆ పార్టీకి దేశంలో ఒక గుర్తింపు రావడానికి వాటి కోసం చేసిన కృషే కదా కారణం! ఆ తెగువ ఇప్పుడేమైంది? ప్రతి విషయంలోనూ కత్తులు దూసుకునే అధికార, ప్రతిపక్ష పార్టీల గొంతు కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోడీ విషయం వచ్చేటప్పటికి ఎందుకు మూగబోతోంది? తాము ఆ తాను లోని ముక్కలమేనని చెప్పుకోవడానికి ఎందుకు పోటీ పడుతున్నాయి?
రైతు బావుంటేనే రాష్ట్రమూ, దేశమూ బావుంటాయి. రైతులకు నష్టం కలిగించే ఏ చర్యయైనా ప్రజలందరి మీదా ప్రభావం చూపుతుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలు కూడా అటువంటివే! వైసిపి, టిడిపి లకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాల తరహాలో రాష్ట్ర శాసనసభలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేయాలి. మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ రైతులకు అండగా నిలవాలి. అప్పుడే నిజమైన రైతు పక్షపాతులనిపించుకుంటారు.










