Nov 12,2022 11:37

ప్రజాశక్తి - వేంపల్లె (కడప) : రాష్ట్రానికి పంగనామం పెట్టిన బిజెపితో పోత్తు పెట్టుకోవడానికి జనసేన పార్టీ ప్రాకులాడడం శోచనీయమని పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. శనివారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సన్యాసి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందని అదే విధంగా బిజెపి, జనసేన రాసుకుంటే అదే జరుగుతుందని చెప్పారు. బిజెపి రాష్ట్రానికి నంబర్‌ వన్‌ ద్రోహపు పార్టీ అన్నారు. ప్రత్యేక హౌదాకు పంగ నామాలు పెట్టిందని చెప్పారు. బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చిందని తెలిపారు. కడప జిల్లా స్టీల్‌ ప్లాంట్‌కు స్వస్తి పలికిందని చెప్పారు. దుగ్గరాజు పట్నం ఓడరేవు ఉసే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసిందని చెప్పారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ప్రస్తావనే లేదని చెప్పారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల అడ్రసే లేదని ఆరోపించారు. మన్నవరం ప్రాజెక్టును మూసేసిందని చెప్పారు. ఆంధ్రా బ్యాంకును కాలగర్భంలో కలిపేసిందని చెప్పారు. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకనైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టిందని మండిపడ్డారు. జనసేన బిజెపికి బి టీమ్‌ తప్ప మరేమి కాదని చెప్పారు. రాష్ట్రంలో బిజెపి పరిస్థితి గొర్రె తోక బెత్తడే అన్నట్లుందని చెప్పారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంతో ఆ బెత్తెడు తోక కూడా ఊసిపోయిందని అన్నారు. గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని అన్నారు. ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచినప్పుటికి ఆయన కూడా పార్టీ మారినట్లు చెప్పారు. ఇటువంటి పార్టీలు రెండు కలిస్తే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం అవివేకం అన్నారు.