- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం జరిగిందనీ, సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై కోతలు విధించి ప్రజలపై అదనపు భారాలు వేసిన బిజెపిని ప్రజలంతా వ్యతిరేకించి సాగనంపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బెంగళూరు బస్టాండ్ కూడలి వద్ద కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా, సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై కోతలు విధించి ప్రజలపై అదనపు భారాలు వేసినందుకు, అదానీ అవినీతికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీ కోతలు విధించిందని, ఎరువులపై సబ్సిడీలు తగ్గించి ధరలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో ఎరువులు అందక రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు రెట్టింపు అయ్యాయని, ఆత్మహత్యలు పెరిగాయని, కౌలు రైతులను కనీసం గుర్తించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్‌లో భారీ కోతలు విధించారని, ఇది పేదల కడుపు కొట్టడం తప్ప మరేమీ కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ఎత్తివేశారని, బడ్జెట్‌లో సంక్షేమ నిధులు తగ్గిపోయాయని, ప్రజాపంపిణీ ద్వారా సరఫరా అయ్యే సబ్సిడీ బియ్యాన్ని రద్దు చేశారని వివరించారు. ధరల పెరుగుదలతో సతమతమవుతున్న జనానికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ఈ బడ్జెట్ భారాలు కోలుకోలేని దెబ్బతీస్తాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరాకరించడమే కాకుండా విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదని, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు నామమాత్రంగా నిధులు విడుదల చేసినా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులివ్వకపోగా పుండుపై కారం చల్లినట్లుగా తుంగభద్ర కెనాల్స్ కింద నీటి సరఫరాను దెబ్బకొట్టే కర్ణాటకలోని అప్పర్ భద్రకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం దారుణం అన్నారు. ఆంధ్ర, కరా?టకల మధ్య విద్వేషాలు పెంచి రానున్న కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపలేదని, కడప ఉక్కు, రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధులు ఇవ్వకుండా బిజెపి రాష్ట్రం పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీ కుంభకోణం అంతర్జాతీయంగా భారతదేశానికి తలవంపులు తెచ్చిందని, చిన్న మదుపుదార్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసిని ముంచేశారని తూర్పారపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని, ప్రకృతి వనరుల్ని అదానీపరం చేస్తుండడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అదానీ అవినీతికి వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా పార్లమెంటులో రాష్ట్రానికి చెందిన సభ్యులు నోరెత్తడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టడం పట్ల సిపిఎం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం హక్కుల సాధనకోసం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఎ.వెంకటేష్, రెడ్డిప్రసాద్, చంద్రశేఖర్, ఛాంద్‌బాష, శివయ్య, పవన్ పాల్గొన్నారు.










