Oct 07,2020 07:58
రాష్ట్రాలపై బలప్రయోగం

రోనా సంక్షోభ సమయాన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంపై బలవంతంగా రుద్దిన వ్యవసాయ చట్టాలు ఏకకాలంలో రైతులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చేస్తూ, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. రాజ్యాంగాన్ని సవాల్‌ చేస్తున్న వ్యవసాయ చట్టాలు న్యాయ సమీక్షలో వీగిపోక తప్పదన్న అభిప్రాయం రానురాను బలపడుతోంది. రాజ్యాంగానికి, దాని మౌలిక సూత్రాలకు విఘాతం కలిగే శాసనాలను చట్టసభలు ఆమోదించరాదు. బుద్ధి గడ్డి తిని ఒక వేళ యాక్టులు చేసినా, అవి రాజ్యాంగానికి విరుద్ధమే అవుతాయి. వ్యవసాయ 'సంస్కరణ'ల లక్ష్యంతో మోడీ సర్కారు తెచ్చిన రైతు ఉత్పత్తుల వర్తక, వాణిజ్య యాక్టు, రైతు సాధికారత, రక్షణ యాక్టు ఈ రెండూ నూటికి నూరుపాళ్లు రాజ్యాంగ విరుద్ధమైనవి. మన పాలనా వ్యవస్థను సమాఖ్య వ్యవస్థగా రాజ్యాంగం చెబుతోంది. కేంద్రానికి, రాష్ట్రాలకు వాటి వాటి పరిధుల్లోపల ప్రత్యేక అధికారాలను నిర్దేశించింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రాష్ట్రాల హక్కులను హరిస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం కావిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లో కేంద్రం, రాష్ట్రాల అధికారాలను పొందుపర్చారు. మొదటి జాబితాలో కేంద్ర అధికారాలు, రెండవ జాబితాలో రాష్ట్రాల అధికారాలు, మూడవ జాబితాలో కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి అధికారాలు స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్రాల అధికారాలకు చెందిన రెండవ జాబితాలో 14వ అంశంగా 'వ్యవసాయం' చెప్పబడింది. ఇదే జాబితాలో 26వ అంశంగా రాష్ట్రంలో వర్తక, వాణిజ్యం, 27వ అంశంలో వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, 28వ అంశంలో మార్కెట్లు, ధరలను పేర్కొన్నారు. వ్యవసాయ సంబంధ అధికారాలన్నీ రాష్ట్రాల పరిధిలో ఉండగా, వాటిని మోడీ ప్రభుత్వం హైజాక్‌ చేసి, తనకు లేని అధికారాలను చేతుల్లోకి తీసుకొని పార్లమెంట్‌లో చట్టాలు చేయడం రాజ్యాంగ హననం, రాష్ట్రాల హక్కులపై దాడి.


వినాశకర వ్యవసాయ చట్టాలను సమర్ధించుకునేందుకు కేంద్రం వల్లిస్తున్న భాష్యాలు ఎంతమాత్రం పొసిగేవి కావు. కేంద్ర, రాష్ట్రాల అధికారాలు గల ఉమ్మడి జాబితాలోని 33వ అంశం ప్రాతిపదికన సదరు చట్టాలు చేయడానికి కేంద్రానికి అధికారాలు సంక్రమిస్తాయని వాదించడం దారుణం. ఉమ్మడి జాబితాలోని 33వ అంశం ఫక్తు ట్రేడ్‌, కామర్స్‌కు ఉద్దేశించినది. దానిలో గోధుమలు, వరి, పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పౌల్ట్రీ, డెయిరీ అనే పదాలే లేవు. కేంద్రం నియంత్రణ లోని పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులకు సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం పార్లమెంట్‌లో చట్టాలు చేయొచ్చని, దిగుమతి చేసుకునే నూనెలు, నూనె పదార్థాలు, పశువుల దాణా, పత్తి విత్తనాలు, ముడి పత్తి, ముడి జూట్‌ల మార్కెటింగ్‌పై కేంద్రం జోక్యం చేసుకొని యాక్టులు చేయొచ్చని ఉమ్మడి జాబితాలోని 33వ అంశం చెబుతోంది. కాగా రైతు, రైతు ఉత్పత్తులు అనే పదాలకు నిర్వచనాలను కేంద్రం మార్చేసింది. మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాళ్ల కింద చిదిమేసి దొడ్డిదారిలో చట్టాలను చేసి అధికార బలప్రయోగానికి పాల్పడింది.


బిజెపి సర్కారు వచ్చింది మొదలు జమిలిగా 'ఏకరూప' సిద్ధాంత భావజాల విస్తృతికి, అంతర్జాతీయ జాతీయ కార్పొరేట్ల అపరిమిత దోపిడీకి మార్గాలు వేసే ఎజెండాను తలకెత్తుకుంది. ఇంటర్నేషనల్‌, నేషనల్‌ పెట్టుబడిదారులు మన వనరుల విశృంఖల దోపిడీకి, ఏకరూప సిద్ధాంతం అమలుకు ఫెడరల్‌ సిస్టం అడ్డంగా నిలుస్తుంది. అందుకే అధికారాలన్నీ కేంద్రం వద్ద కేంద్రీకృతం చేసే చర్యలకు మోడీ ప్రభుత్వం బరితెగిస్తోంది. అందుకు రాజ్యాంగాన్ని సైతం తోసిరాజంటోంది. జిఎస్‌టి, నూతన విద్యా విధానం, ఇత్యాది చర్యలు అందులో భాగమే. ఇప్పుడు రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. రాష్ట్రాల అసెంబ్లీల్లో వ్యవసాయ బిల్లులు పెడితే పలు సవరణలు, సూచనలు, నిరసనలు వచ్చేవి. అందుకే రాష్ట్రాలతో కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాలు చేసింది. ఇప్పటికే రాజ్యాంగ విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను హరించి కేంద్రం చేసిన చట్టాలపై కొన్ని ఎన్‌డిఎ యేతర రాష్ట్రాలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాయి. కేంద్రం చేతిలో తమ జుట్టు ఇరికినప్పటికీ, రైతు, ప్రజా ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నప్పటికీ అవేమీ పట్టకుండా కేవలం తమ స్వప్రయోజనాలనాశించి వినాశకర చట్టాలకు మద్దతిస్తున్న రాష్ట్రాలు, పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలి.