సుదీర్ఘ విరామం తరువాత మంగళవారం నాడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించే కన్నా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తన పట్టు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నించింది. కృష్ణా, గోదావరి నదీజలాల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించే అధికారం తమదేనని సమావేశం తరువాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించడంలోనే ఆ విషయం స్పష్టమవుతోంది. బోర్డుల పరిధితో పాటు, కేటాయింపులు, ప్రాజెక్టులకు అనుమతుల వంటి విషయాల్లో తుది నిర్ణయం తమదేనని షెకావత్ ప్రకటించడం ఆమోదయోగ్యం కాదు. అయితే, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం నిర్దేశించిన విధంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలన్న అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం సానుకూలమైనది. కృష్ణా జలాల వివాదాలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో వేసిన కేసు ఉపసంహరించడానికి సి.ఎం కెసిఆర్ అంగీకరించడం, ఆ తరువాతనే నదీ జలాల పంపిణీకి నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించడం మంచిదే. కొత్త ప్రాజెక్టుల డిపిఆర్‌లు కేంద్రానికి పంపడానికి ఇరువురు సి.ఎంలు అంగీకరించడం సానుకూల పరిణామం.
రెండు గంటల పాటు సాగిన సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య వాడివేడిగా చర్చ సాగినట్లు వార్తలొచ్చాయి. పోతిరెడ్డిపాడు నుండి పెద్ద ఎత్తున నీటిని తరలించడానికి ఎపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లేవనెత్తడం, దానికి సమాధానంలా తెలంగాణ నిర్మిస్తోన్న కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించడం అందరూ ఊహించినదే! ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటె ఒక్క చుక్క కూడా అదనంగా తీసుకోబోమని ఎ.పి సి.ఎం చెప్పినా ఇదే ధోరణి కొనసాగిస్తే ఆలంపూర్-పెద్దమరూర్ వద్ద బ్యారేజి నిర్మించి రోజుకు 3 టిఎంసిల కృష్ణా నీటిని తరలిస్తామని తెలంగాణ సి.ఎం అనడం సబబు అనిపించుకోదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదోపవాదాల మధ్యనే కేంద్రం తన పని తాను చక్కబెట్టుకుంది. 'ఒకే దేశం- ఒకే ప్రజ- ఒకే భాష' వంటి నినాదాల మాటున రాష్ట్రాల హక్కులను హరించివేసే ఆర్‌ఎస్‌ఎస్ ఎజండాను అమలు చేయడానికి కేంద్ర మంత్రి ఈ సందర్భాన్ని వినియోగించుకున్నారు. కృష్ణా, గోదావరి నీటి యాజమాన్య బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర మంత్రి ఏకపక్షంగా ప్రకటించడం రాష్ట్రాల హక్కులను తిరస్కరించడమే. ఈ సందర్భంగానే ఆయన గోదావరి-కృష్ణా- కావేరి నదుల అనుసంధాన విషయాన్ని ప్రస్తావించడం అభ్యంతరకరం. నదుల అనుసంధానం అంశం అత్యంత వివాదాస్పదమైనదేగాక అనేక రాష్ట్రాలకు సంబంధించినది. అటువంటి విషయాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించడం దుర్బుద్ధి పూరితమైనది.
తెలుగు గడ్డపై తాగు, సాగు నీటి కొరతతో అల్లాడే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలు, అటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు, ఆ మాటకొస్తే భాగ్యనగరమూ ఆ కోవలోనికే వస్తాయి. ఏ రాష్ట్రంలో వున్నా ఇలాంటి ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చడం, భూములకు సాగునీటిని కల్పించడం ప్రభుత్వాల బాధ్యతగా వుండాలి. వాస్తవాల ప్రాతిపదికగా నిరపేక్షంగా చర్చించి నిష్పక్షపాతంగా నిర్ణయాలు చేయాలి. అందుకు సాంకేతిక, చారిత్రక సమాచారం కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తావు లేని విధంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. అందుకు ఇరు రాష్ట్రాలలోనూ ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సంస్థలతో సమావేశాలు నిర్వహించడం ఎన్నికైన ప్రభుత్వాల బాధ్యత. ఆ దిశగా చర్యలు చేపట్టడం ఇరువురు ముఖ్యమంత్రులు తమ కర్తవ్యంగా భావించాలి. అప్పుడే రాష్ట్రాల హక్కులను హరించి వేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ముకుతాడు వేయడం సాధ్యం. తద్వారా ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడగలం.










