ప్రజాశక్తి - రెడ్డిగూడెం : ఈనెల 11వ తేదీన సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ఆంజనేయులు పిలుపునిచ్చారు. రెడ్డిగూడెం సిపిఎం పార్టీ మండల కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్లు లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాతావరణం మారిపోవటంతో వర్షాకాలం కావడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారటంతో మురుగు నీరు నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరిగాయానీ దాంతో విష జ్వరాలు, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన జరుగుతుందనీ కనుక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు యం మాధవరెడ్డి, పార్టీ మండల కార్యదర్శి జంగా వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, అప్పిరెడ్డి, ఇశ్రాయేలు, బాబు, మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










