ప్రజాశక్తి-రాయచోటి : ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గిరీష పేర్కోన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఫ్యామిలీ డాక్టర్, అనీమియా, తదితర అంశాలపై వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటి ముంగిటకే వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పకడ్బందీగా అమలయ్యేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. డాక్టర్లు ఇంటిదగ్గరకు వెళ్లి రోగులకు వైద్య సేవలు అందిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. డాక్టర్లు గ్రామీణ ప్రాంత ప్రజల ఇంటి ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందించాలన్నారు. డాక్టర్లు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సాధారణ ఆరోగ్య సమస్యలు, గర్భిణులు, బాలింతలు, శిశువులకు, రక్త హీనత ఉన్న వారికి, షుగర్ వ్యాధి గ్రస్తులకు, కిడ్నీ సమస్య ఉన్న వారికి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. రక్తహీనత లోపం ఉన్న గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి సరైన వైద్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత నివారణకు కృషి చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు అనీమియా బారిన పడకుండా ఉండేందుకు, మంచి పౌష్టికాహారం తీసుకునే టట్లు వారికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కంటి వెలుగు స్క్రీనింగ్ పక్కగా జరగాలన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి డాక్టర్లు తప్పకుండా కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అవసరమైన వారికి ఉచితంగా కంటి అందాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ కొండయ్య, మెడికల్ ఆఫీసర్‌లు పాల్గొన్నారు.










