బెంగళూరు : మైసూర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లో అపశృతి చోటుచేసుకుంది. ఫొటోలు దిగుతుండగా పడవబోల్తా పడటంతో కాబోయే దంపతులు మరణించారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కర్ణాటకలోని క్యాతమరానహళ్లికి చెందిన చంద్రు, శశికళకు గతేడాది నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 22న వివాహం జరపాలని పెద్దలు నిర్నయించారు. పెళ్లి వేడుకలో భాగంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలని వధూవరులు భావించారు. ముదుకుతూర్‌లో కావేరీ నదీతీరాన టైటానిక్‌లో ఫోజ్‌లో ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇరువురూ అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం నుండి పడవ నడిపే వ్యక్తి, ఫొటోగ్రాఫర్‌లు బయటపడ్డారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని పోలీసులు తెలిపారు.










