పుణె : ప్రస్తుతం యువత అన్ని విషయాల్లోనూ భిన్నంగా ఉండాలని, భిన్నంగా ఆలోచించాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ప్రతి పనినీ భిన్న కోణంలో చూపిస్తూ యువత ఎంజారు చేస్తున్నారు. కొన్ని విషయాల్లో హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు కూడా. ఏదో చేయబోయి ఎదురుదెబ్బలు తిన్న సంఘటనలు అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం పెళ్లి విషయంలో మాత్రం యువత తమకు నచ్చిన విధంగా రకరకాలుగా కొత్త పద్ధతుల్లో చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఫొటోషూట్ అయితే చెప్పనక్కర్లేదు. ఫొటోషూట్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్లి.. రిస్కు చేసైనా సరే రకరకాల పద్ధతుల్లో ఫొటోలు దిగుతున్నారు. అయితే, తాజాగా ఓ యువతి పెళ్లికి ముందు ఫొటో షూట్‌ను అందరిలా కాకుండా భిన్నంగా చేయాలని ప్రయత్నించింది. పుణెలోని పింపరీ చించ్‌వడ్‌కు చెందిన శుభంగి అనే యువతి ఏకంగా స్కార్పియో కారు బానెట్‌పై కూర్చొని పెళ్లి మండపం వరకూ వెళ్లింది. ముందు ఫొటో గ్రాఫర్ బైక్‌పై వెనక్కి తిరిగి కూర్చొని ఆమెను ఫొటోలు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, కరోనా నిబంధనల కారణం చూపి వధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు.










