Jan 28,2023 20:59

సిలిండర్ల గురించి వివరిస్తున్న నిర్వాహకులు మనోజ్‌

       ప్రజాశక్తి-హిందూపురం   తక్కువ బరువుతో తేలికగా, ధృఢంగా ఉండే విధంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు మనోజ్‌ కోరారు. ఈమేరకు శనివారం స్థానిక కార్యాలయంలో ఫైబర్‌ సిలిండర్‌కు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఫైబర్‌తో తయారయ్యే ఈ సిలిండర్లు 10.5 కిలోల గ్యాస్‌ వేరియంట్లలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సాధారణ సిలిండర్లు ఇనుముతో తయారై, చాలా బరువుగా ఉండి 14.2 కిలోల గ్యాస్‌ ఉంటుంది. బరువు ఎక్కువ కావడంతో వీటిని తరలించడం ఇబ్బందికరం ఉందన్నారు. అంతేగాకుండా చిలుము పట్టడం, వంట గదిలో నేలపై మరకలు పడటం వంటి సమస్యలు ఉంటాయన్నారు. అదే ఫైబర్‌ సిలిండర్లు తేలికగా ఉంటాయని, మోసుకెళ్లడం సులభం అవుతుందన్నారు. అలాగే చిలుము, మరకలు ఉండవన్నారు. మహిళలు కూడా సులువుగా మార్చుకోవచ్చన్నారు. పాత గ్యాస్‌ ఉన్న వారు దాన్ని వెనక్కి ఇచ్చేసి ఫైబర్‌ సిలిండర్లను పొందవచ్చన్నారు. కొత్తగా ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ పొందాలంటే డిపాజిట్‌ మొత్తం కింద రూ.3500 చెల్లించాలన్నారు. పాత సిలిండర్‌ వాడుతున్న వారు అయితే పాత సిలిండర్లను వెనక్కి ఇచ్చి, చెల్లించిన డిపాజిట్‌ మినహా మిగిలినది చెల్లిస్తే కనెక్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.