Mar 31,2023 22:04
  • కొత్త స్పైవేర్‌ వేటలో మోడీ ప్రభుత్వం!

న్యూఢిల్లీ : పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలుపై రేగిన దుమారం సద్దుమణగక ముందే మోడీ ప్రభుత్వం మరో కొత్త స్పైవేర్‌ కోసం వేట మొదలెట్టింది. పెగాసస్‌ను విక్రయించిన ఇజ్రాయిల్‌ ఎన్‌ఎస్‌ఒ గ్రూపు గురించి అందరికీ తెలిసిపోవడంతో, ఈసారి బయటి ప్రపంచానికి అంతగా తెలియని సంస్థల నుండి కొత్త స్పైవేర్‌ కొనుగోలుకు భారత ప్రభుత్వం జోరుగా పావులు కదుపుతున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇందుకోసం రాబోయే కాలంలో 120 మిలియన్ల డాలర్లు (రూ.986 కోట్లు) మొత్తాన్ని ఖర్చు చేయాలని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆ పత్రిక ప్రత్యేక కథనంలో పేర్కొంది.
ఇందుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియలో దాదాపు డజను వరకు సంస్థలు పాల్గంటాయని భావిస్తున్నారు. ఇవన్నీ పెగాసస్‌ విక్రయ సంస్థ ఎన్‌ఎస్‌ఎ గ్రూపునకు ప్రత్యర్ధి కంపెనీలే అయి వుంటాయని భావిస్తున్నారు. పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించారా లేదా అని ఫోరెన్సిక్‌ పరీక్షల ద్వారా తెలుసుకునే సామర్థ్ద్యం మానవ హక్కుల గ్రూపులకు వుండడం, పైగా ఎవరు లక్ష్యంగా మారారో వారికి యాపిల్‌, వాట్సాప్‌ల నుండి హెచ్చరికలు వీటన్నిటితో ప్రభుత్వ అధికారులు పిఆర్‌ సమస్య గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. దీంతో పెగాసస్‌కు బదులు వేరే కొత్త సంస్థ నుంచి స్పైవేర్‌ కొనాలని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ఆ వార్తా కథనం పేర్కొంది. రాబోయే కొన్నేళ్లలో కోటి 60 లక్షల డాలర్ల నుండి 12 కోట్ల డాలర్ల వరకు కాంట్రాక్టులు కుదిరే అవకాశం వుందని ఆ వర్గాలు తెలిపాయి. భారత రక్షణ, ఇంటెలిజెన్స్‌ అధికారులు పరిశీలిస్తున్న స్పైవేర్‌ సంస్థల్లో చాలావరకు ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం వుందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం తెలిపింది.
అలా పేర్కొన్న కంపెనీల్లో గ్రీస్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఇంటెలెక్సా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రముఖుల జోక్యంతో ప్రిడేటర్‌ స్పైవేర్‌ను ఈ సంస్థ సృష్టించింది. ఈజిప్ట్‌, సౌదీ అరేబియా, మడగాస్కర్‌, ఒమన్‌ వంటి దేశాలతో సహా మానవ హక్కుల సూచీలో అట్టడుగున గల దేశాల్లో ఇప్పటికే దీన్ని ఉపయోగించిన చరిత్ర వుంది. భారత ప్రభుత్వం ఆశ్రయించిన కంపెనీల జాబితాలో క్వాడ్రెమ్‌ అనే మరో కంపెనీ కూడా వుంది. జర్నలిస్టు జమాల్‌ ఖషోగీ హత్య తర్వాత సౌదీ అరేబియాకు స్పైవేర్‌ను విక్రయించిన సంస్థ ఇది. కాగ్నైట్‌ అనే మరో సంస్థ కూడా మోడీ ప్రభుత్వ పరిశీలనలో వుంది. ఆయా కంపెనీలతో రాజ్‌నాథ్‌ నేతృత్వంలోని రక్షణ మంత్రిత్వ శాఖ జరుపుతున్న చర్చలు అడ్వాన్స్‌ దశలో వున్నాయి. అయితే లాంఛనప్రాయమైన 'ప్రతిపాదనకు అభ్యర్థ్ధనలు' పంపడానికి ఇంకా చాలా వారాలు పడుతుంది. వీటిలో ఏ కంపెనీ కూడా ఈ కథనంపై స్పందించడానికి ఇష్టపడలేదు. రక్షణ శాఖ దీనిపై మౌనం వహించింది. క్రమబద్ధీకరణలో లేని స్పైవేర్‌ పరిశ్రమపై ఆంక్షలు విధించడానికి అమెరికా నేతృత్వంలో తాజా ప్రయత్నాలు జరిగాయి. నిఘా కోసం నిరంకుశ ప్రభుత్వాలు వాడే వాణిజ్యపరమైన స్పైవేర్‌ను ప్రభుత్వం ఉపయోగించడాన్ని నిషేధిస్తూ మార్చి 27న అమెరికా ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొచ్చింది.

అమెరికా ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన 'ప్రజాస్వామ్య సదస్సు'లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా, కెనడా, కోస్టారికా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, నార్వే, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌, అమెరికా ప్రభుత్వాలన్నీ కలిసి స్పైవేర్‌ వినియోగానికి చట్టబద్ధమైన యంత్రాంగాలను రూపొందించి, అమలు చేయడానికి ఏక తాటిపైకి వచ్చాయని చెప్పారు. ఇటువంటి సాధనాల దుర్వినియోగం చాలా ఎక్కువగా వుందని, జాతీయ భద్రతకు ముప్పు పెరిగిందని వైట్‌హౌస్‌ గురువారం విడుదలజేసిన ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొంది. అయితే చాలా ప్రభుత్వాలు తమ సొంత ఇంటెలిజెన్స్‌ వర్గాలు రూపొందించిన నిఘా సాధనాలనే ప్రతిపక్ష నాయకులపైన, ఉన్నతాధికారులపైన, జర్నలిస్టులపైన ఉపయోగిస్తుంటాయని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది.