Oct 06,2020 06:57
పట్టణవాసులకు పొంచి ఉన్న ప్రమాదం

రు నెలలకో, సంవత్సరానికో, ఇంకొంత కాలానికైనా కరోనా తగ్గవచ్చు. కానీ కరోనా నుంచి రక్షించే పేరుతో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్యాకేజీలు, తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే ప్రమాదం మాత్రం దీర్ఘకాలం కొనసాగుతుంది. ఐసిఎంఆర్‌ సర్వే ప్రకారం గ్రామాల్లో 4.4 శాతం మందికి, పట్టణాలలో మురికివాడల్లో 15.6 శాతం మందికి, మురికివాడలు కాని ప్రాంతాల్లో 8.2 శాతం మందికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేశారు. విజయవాడ నగరంలో 40 శాతం మందికి వచ్చి పోయి ఉంటుందని సీరో సర్వే ద్వారా నిర్ధారణకు వచ్చారు. కరోనాతో ఆరోగ్యమే కాదు, ఆర్థికంగానూ ప్రజలు దెబ్బతిన్నారు. ఉపాధి కోల్పోయారు. కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. పట్టణాలలో జన సాంద్రత, ఎక్కువగా ఉండటం, పర్యావరణ సమస్యలు తదితర కారణాల వలన కరోనా, అంటువ్యాధులు, విష జ్వరాల ప్రభావం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అందుకే పట్టణ ప్రణాళికలో మార్పులు తేవాలి. గృహ నిర్మాణ పథకాల ప్లాన్లు మారాలి. ప్రజారోగ్యం, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, పౌష్టికాహారం తదితర అంశాలపై దృష్టి పెంచాలి.


జబ్బొకటి - మందొకటి
కానీ మోడీ ప్రభుత్వం వీటన్నిటినీ గాలికొదిలేసి 'ఆత్మ నిర్భర భారత్‌' పేరుతో ప్రజలను దెబ్బ తీసే సంస్కరణలు చేపట్టింది. ఇప్పటికే ధరల భారాన్ని పెంచింది. అన్ని రంగాలలో ప్రైవేటీకరణకు తెగబడుతోంది. అప్పులు, నిధులు ఎరచూపి రాష్ట్ర ప్రభుత్వాలను లొంగతీసుకొని ప్రమాదకరమైన విధానాలను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల అప్పు పరిమితిని...రాష్ట్ర సగటు ఉత్పత్తిలో (జిఎస్‌డిపి) మూడు శాతం నుండి ఐదు శాతం వరకు పెంచేందుకు... కొన్ని షరతులతో ముడి పెట్టింది. అందులో విద్యుత్‌, రేషన్‌, పెట్టుబడులు ఆకర్షించడం వంటి అంశాలతోపాటు.... మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పన్నులు, చార్జీలు పెంచే సంస్కరణలు ముందుకు తెచ్చింది. స్మార్ట్‌ సిటీలు, అమృత్‌ తదితర పథకాలు ప్రవేశపెట్టి ప్రైవేటీకరణ, పన్నుల పెంపు, యూజర్‌ చార్జీల విధింపు వంటి అంశాలు అమలు జరపటానికి ప్రయత్నిస్తోంది. తాజాగా కరోనా సాకుతో తెచ్చిన వినాశకర విధానాలు మరింత వేగంగా అమలు జరుగుతున్నాయి. మన రాష్ట్రం లోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కేంద్రానికి పూర్తిగా తలొగ్గి...కేంద్రంతో జత కట్టి ప్రజల నడ్డి విరచడానికి రంగం సిద్ధం చేస్తోంది. స్థానిక సంస్థలు ఆదాయం పెంచుకోవాలని, తమ కాళ్లపై తాము నిలబడాలని హితబోధ చేస్తూ స్థానిక సంస్థల కాళ్లు నరుకుతున్నారు. పట్టణాలలో ఇంటి పన్నుతో పాటు అనేక రకాల పన్నులు, చార్జీలు ఇప్పటికే ఉన్నాయి. క్రమంగా పెంచారు. ఇప్పుడు మరోసారి ఆస్తి పన్ను (ఇంటి పన్ను) పెంచటానికి కత్తులు నూరుతున్నారు. అంతేకాక పన్ను విధించే పద్ధతిని మార్చాలని కేంద్ర పభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు ఇంటి అద్దె విలువ ఆధారంగా పన్ను విధిస్తారు. ఇంటి విస్తీర్ణం ఆధారంగా ఆ ప్రాంతంలో సుమారుగా ఎంత అద్దె ఉండే అవకాశం ఉందో రేట్లు నిర్ణయించి సంవత్సరానికి వచ్చే విలువ నిర్ధారించి, అందులో 15 నుండి 25 శాతం వరకు పన్ను గా, రెండు అర్ధ సంవత్సరాల్లో వసూలు చేస్తారు. కానీ ఇప్పుడు ఆస్తి విలువ (స్థలం విలువ, కట్టడం విలువ) లెక్కగట్టి దాని ఆధారంగా పన్ను విధిస్తారు. ఒక పట్టణంలో 100 గజాల స్థలంలో ఇల్లు ఉంటే, రిజిస్ట్రేషన్‌ విలువ గజానికి రూ. 25 వేలు ఉన్నట్లయితే ఆ ఆస్తి విలువ రూ. 25 లక్షలు అవుతుంది. అందులో ఒక శాతం పన్నుగా నిర్ణయించినా, సంవత్సరానికి రూ. 25 వేలు ఇంటి పన్ను పడుతుంది. ప్రతి సంవత్సరం భూముల విలువలను ప్రభుత్వం పెంచుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం భూమి విలువ ఆధారంగా ఇంటి పన్ను పెరుగుతుంది. దీనిప్రకారం ప్రస్తుతం ఉన్న పన్ను కంటే పది రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఈ విధానమే ప్రమాదకరమైనది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1704 కోట్లు ఆస్తిపన్ను డిమాండ్‌ ఉంది. ఇది ఒకేసారి రూ. 10 వేల కోట్లకు కూడా చేరే ప్రమాదం ఉంది. మున్సిపాలిటీలలో మంచి నీరు, డ్రైనేజీ, పారిశుధ్య తదితర సేవలు అందించడానికి అయిన ఖర్చు మొత్తం లెక్కించి దాని మొత్తాన్ని ప్రజల నుండి వసూలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రతి పనికి, సేవకు రేటు కట్టి చార్జీలు వసూలు చేయాలని షరతులు విధించారు. 24 /7 మంచినీటి సరఫరా పేరు చెప్పి ఇళ్లలోని కుళాయిలకు మీటర్లు బిగించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. నీరు తాగినందుకే కాదు, భూగర్భ డ్రైనేజీ లోకి మురుగు నీరు వదిలినందుకు నెలవారి పన్ను చెల్లించాల్సిందే. మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ నిర్వహణకు అంటే సిబ్బంది జీతాలు, విద్యుత్‌ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు మొత్తం లెక్కించి దాని మొత్తాన్ని ప్రజల నుండి రాబట్టడానికి ప్రతి సంవత్సరం చార్జీలు పెంచుతారు.


నాడు జుట్టు పన్ను, నేడు చెత్త పన్ను
స్వచ్ఛ భారత్‌ పేరుతో అవార్డులు పెట్టి నగరాలకు ర్యాంకులు ఇస్తున్నారు. పరిశుభ్రతను బట్టి అవార్డులు ఇస్తే తప్పులేదు. కానీ ర్యాంకులు నిర్ణయించడానికి పారిశుధ్య నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తంలో ప్రజల నుండి ఎంత వసూలు చేస్తున్నారనే లెక్కల ఆధారంగా మార్కులు వేసి అవార్డులు ఇస్తున్నారు. అవార్డులు ఎరగా చూపి ఇప్పటికే విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలలో చెత్త పన్ను నెలకు రూ. 30 నుండి రూ. 100 వరకు వసూలు చేయడానికి నోటీసులు ఇచ్చారు. ఇంతటితో ఇది ఆగదు. పారిశుధ్య సిబ్బంది జీతాలు, వాహనాలకయ్యే ఖర్చు మొత్తం మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని లెక్కించి, క్రమంగా ఆ మొత్తం వసూలు అయ్యే విధంగా ప్రతి సంవత్సరం ఈ రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే అనేక పట్టణాలలో కళ్ళకి కనపడకుండా చెత్త పన్ను, యూజర్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీలను సేవా సంస్థలుగా కాకుండా వ్యాపార సంస్థలుగా మార్చుతున్నారు. పౌరసేవలను వ్యాపార సరుకులుగా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వినాశకర విధానాల అమలులో దూకుడుగా ఉంది. దేశంలో రైతుల పంపుసెట్లకు మీటర్లు పెడుతున్న ఘనత తమదేనని గొప్పగా చెప్పుకుంటున్నది. అప్పుల కోసం అర్రులు చాస్తూ పట్టణాలలోనూ పన్నులు పెంచడానికి వేగంగా పావులు కదుపుతోంది. ఆగస్టు 24వ తేదీన మున్సిపల్‌ శాఖ విడుదల చేసిన 14034 సర్క్యులర్‌ దీనికి సాక్ష్యం. ఆస్తి పన్ను విధానాన్ని మార్చడానికి, మంచి నీరు, డ్రైనేజీ చార్జీల పెంపుదలకు అధికారులతో మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. మున్సిపల్‌ చట్టాలను కూడా సవరించడానికి కమిటీని నియమించింది. ఇప్పటికే అధికారుల బందాలు ఇతర రాష్ట్రాలను పరిశీలించి వచ్చాయి.


ప్రభుత్వ గృహాలు - పేదల నుండి అద్దె వసూళ్లు
లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలను గాలికొదిలేసిన నరేంద్ర మోడీ ఇప్పుడు వలస కూలీల పట్ల ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. వారి కోసం పట్టణాలలో అద్దె గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు. అఫర్డబుల్‌ రెంటల్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌ల (ఎఆర్‌హెచ్‌సి) పేరుతో పథకాన్ని రూపొందించారు. దీని ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతో అద్దె గృహ సముదాయాలు నిర్మించి పేదలకు అద్దెకు ఇస్తారు. వీటిని ప్రైవేటు కంపెనీలు నిర్వహిస్తాయి. నెలవారి అద్దె వసూలు చేస్తారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వటం లేదా ప్రైవేటు స్థలాలలో బడా కంపెనీలు గృహ సముదాయాలు నిర్మిస్తాయి. వారికి ఇన్‌కమ్‌ టాక్స్‌, జిఎస్‌టి, భవన నిర్మాణ ఫీజులలో రాయితీలు ఇస్తారు. బ్యాంకుల ద్వారా వడ్డీ రాయితీతో రుణాలు అందిస్తారు. ప్రైవేట్‌ కంపెనీలు ఈ గృహ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చూస్తాయి. అద్దె కూడా రెండేళ్లకు 8 శాతం చొప్పున, ఐదేళ్లలో 20 శాతం వరకు పెంచుతారు. ఇప్పటికే నిర్మించి ఖాళీగా ఉన్న ఇళ్ళను కూడా అద్దె గృహాలుగా మార్చుతారు. ''పేదలందరికీ ఇళ్లు'' నిర్మిస్తామన్న పాలకుల హామీ ఏమవుతుంది? సొంత ఇల్లు ఇవ్వకుండా ప్రభుత్వం పేదల నుండి అద్దె వసూలు చేస్తే ప్రయోజనం ఉంటుందా? రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఊరిస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే ఈ స్థలాలలో ఇళ్ల నిర్మాణాలు ఎలా చేస్తారు? ఇప్పటికే నిర్మించి ఖాళీగా ఉన్న లక్షల ఇళ్లను.... డిపాజిట్లు కట్టిన పేదలకు ఇస్తారా? లేదా? వాటినికూడా అద్దె గృహాలుగా మారుస్తారా? ఇటువంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పథకం వలన పేదలు లబ్ధి పొందుతారా? లేదా బడా కంపెనీలు పెట్టుబడులు పెట్టి రాయితీలు పొంది లాభాలు సంపాదించుకుంటాయా? అన్న అనుమానం కలగడం సహజం.


సంస్కరణల పేరుతో మరెన్నో హానికర చర్యలు
విద్యుత్‌ రంగంలోనూ క్రాస్‌ సబ్సిడీలు రద్దు చేసి, స్లాబులు తొలగించి, అందరికీ ఒకటే స్లాబ్‌ నిర్ణయించే పద్ధతి రాబోతోంది. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీకి అయ్యే ఖర్చు మొత్తం పేదల నుండి కూడా రాబట్టడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. రేషన్‌ షాపులలో బియ్యం పంపిణీ బదులు నగదు బదిలీ చేసే విషయం ఆలోచిస్తామని మంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో కార్మిక చట్టాలను నీరుగార్చారు. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు భూముల కేటాయింపు, వివిధ రకాల రాయితీలు, చట్టాలు నిబంధనలు మార్పులు చేస్తోంది. రిలయన్స్‌ వంటి బడా కంపెనీలు రిటైల్‌ వ్యాపారంలోకి 'జియో' మార్ట్‌ పేరుతో పూర్తిగా రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చేయూత, ఆసరా పథకాల ద్వారా అప్పులిచ్చి వ్యాపారాలు ప్రారంభించాలని సూచిస్తున్నది. ఈ వ్యాపారాలకు రిలయన్స్‌, ఐటిసి ఇతర బడా కంపెనీలకు ముడి పెట్టి రిటైల్‌ మార్కెట్లోకి కంపెనీల ప్రవేశానికి దొడ్డిదారిన మార్గం సుగమం చేస్తోంది. ఇప్పటికీ జనం కరోనా కష్టాల్లో ఉన్నారు. ఆదాయం పడిపోయింది. ఉపాధి దెబ్బతిన్నది. ధరలు పెరిగిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని ప్రజల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రం పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు పెంచాయి. రాష్ట్రంలో వృత్తి పన్నులు, మోటారు వాహనాల పన్ను, గ్రీన్‌ ట్యాక్స్‌ తదితర భారాలు మోపటానికి రంగం సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నింటికీ పార్లమెంటులో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి సభ్యులు గుడ్డిగా సమర్థించారు.


భారాలకు ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్
ముఖ్యమంత్రి జగన్‌ ఆగస్టు 31వ తేదీన మున్సిపల్‌ శాఖ అధికారులతో సమీక్ష జరిపి ప్రమాదకర విధానాల అమలుకు ఆదేశాలు ఇచ్చారు. నిస్సిగ్గుగా తొలుత తామే అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు జరగవలసి ఉన్నందున ఎన్నికల తర్వాత ఈ ప్రమాదాల విశ్వరూపం కనబడుతుంది. అప్పటివరకు దశలవారీగా విడివిడిగా అమలు చేయవచ్చు. భారాలు ఉండవని నమ్మబలకవచ్చు. రాష్ట్రం లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు మోడీ విధానాలకు జైకొడుతున్నాయి. ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశాయి. స్థానిక సంస్థల అభివద్ధికి మరో మార్గం లేదని ప్రభుత్వం వాదించవచ్చు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలను మూడవ అంచ ప్రభుత్వంగా గుర్తించాలి. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి. రాష్ట్ర బడ్జెట్లో 40 శాతం స్థానిక సంస్థలకు బదలాయించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్లలో కోత పెట్టి కార్పొరేట్లకు రాయితీలా ఇస్తున్నాయి. ఈ నిధులు ఇస్తే ప్రజలపై పన్నులు పెంచాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థలు సజావుగా నడుస్తాయి. ప్రజలకు పౌర సదుపాయాలు అందుతాయి. అందుకే ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజలను సమీకరించి, ఈ వినాశకర సంస్కరణలను ఎదుర్కోవాలి. ఉమ్మడి ఉద్యమంతో ప్రతిఘటించాలి.

సిహెచ్‌. బాబూరావు
- సిహెచ్‌. బాబూరావు
(వ్యాసకర్త సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు)