Dec 13,2020 07:39

మనది సర్వస్వతంత్ర దేశం. లౌకిక, సార్వభౌమ, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని మనకు మనమే సమర్పించుకున్నాం. సామ్యవాదమనే విశేషణం ఆరంభంలో లేదు. ప్రపంచంలో సంభవించిన విప్లవాలు, ముఖ్యంగా రష్యా, చైనా, క్యూబా వంటి దేశాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు, అక్కడి ప్రజలకు సామ్యవాద పాలన వలన దక్కిన సమగ్ర స్వతంత్ర అభివృద్ధి, నిర్మాణాత్మకమైన వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అపూర్వమైన ఫలితాలు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించాయి. 'సోషలిజం' తోక తగిలించుకోకపోతే ఓట్లు రాలవన్న పాలక వర్గాల అంచనాల ఫలితంగా మన రాజ్యాంగ పీఠికలో 'సోషలిస్టు' అనే పదాన్ని చేర్చుకోవడం జరిగింది. వీటన్నింటిలో 'ప్రజాస్వామ్యం' అనేది అత్యంత కీలకమైన భాగం. నిజమైన ప్రజాస్వామ్యం లేకుండా మిగతా విశేషణాలకు విలువ సున్నా. అలాంటిది దేశంలో వరుస ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ప్రజాస్వామ్యాన్ని పలుచనజేసి పాతరవేశాయి.
 

బీటలు వారిన ఫెడరలిజం
ఇందిరాగాంధీ 'ఎమర్జెన్సీ' ప్రకటించి ప్రజల హక్కులకు, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. నేటి మోడీ ప్రభుత్వం అలాంటి ప్రకటనలేవీ చేయకుండానే కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఉన్న కోట్లాది ప్రజల గొంతులు నొక్కి, రాష్ట్రాలను సామంతుల స్థాయికి దిగజార్చింది. దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేసే ఒక మత రాజ్యాన్ని స్థాపించాలని, దాని కోసం బరితెగించి, ప్రజాస్వామ్యాన్ని, ఫెడరిలిజాన్నీ, మత స్వేచ్ఛనీ హరిస్తున్నది. వ్యక్తుల పైనా, సంస్థల పైనా, పార్టీల పైనా, రాష్ట్ర ప్రభుత్వాల పైనా దేశద్రోహ ముద్ర వేస్తున్నది. మిగతా మూడున్నరేళ్ల తమ పాలన లోపే ఆ తంతు పూర్తి చేసి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అయిన హిందూ మత రాజ్య స్థాపన దిశలో తమ జెండాని ప్రతిష్టించాలని వేగంగా పావులు కదుపుతున్నది.
 

మిగతా రాజకీయ శక్తులేం చేస్తున్నాయి?
ఈ ప్రమాదాన్ని దేశం లోని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు సరైన మోతాదులో గుర్తించడంలేదనే చెప్పాలి. అధికార పీఠాన్ని అధిరోహించడమే రాజకీయ పార్టీలకు లక్ష్యం కావచ్చు. మత, సాంస్కృతిక, ప్రాంతీయ, భాషల వంటి బహుళ వైవిధ్యాల సమిష్టి సమాహారంగా ఉన్న మన దేశంలో వీటన్నింటినీ అవగతం చేసుకొని, ఆయా వర్గాల సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ సమైక్య భారతీయతత్వాన్ని నిలబెట్టు కుంటేనే దేశ సౌభాగ్యానికీ, సామాజిక పురోగమనానికీ అవకాశం ఉంటుంది. ఇది గ్రహించకుండా, కేంద్రం లోనో కొన్ని రాష్ట్రాల లోనో, అదీ సాధ్యం కాకపోతే ఒక చిన్న ప్రాంతంలోనైనా అధికారం లోకి రావాలనీ, నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే కుత్సితంతో నడుస్తున్నాయి రాజకీయ పార్టీలు. చొక్కాలు మార్చుకున్నంత సులభంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టాలను చట్టుబండలు చేస్తున్నారు. ముఠాలుగా మారి గంపగుత్తగా కొనుగోళ్ళకు, అమ్మకాలకు సిద్ధమైపోతున్నారు. వామపక్షాలు దాదాపుగా ఈ రొచ్చు రాజకీయాలకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. వాటికున్న అవకాశాల మేరకు నికరంగా నిలబడి సమస్యల ప్రాతిపదికన పోరాడుతున్నాయి. వాటి మధ్య ఐక్య కార్యాచరణ మాత్రం ప్రజల ఆశలకుగాని, ప్రస్తుత అవసరాలకుగాని అనుగుణంగా లేదు. ప్రజాస్వామిక దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక హక్కుల స్థితిగతులు, ప్రజాతంత్ర పద్ధతి లో ఎన్నికల నిర్వహణ, రాజ్యాంగబద్ధ పాలన, అభిప్రాయ స్వేచ్ఛ లాంటి అంశాలలో ఏ స్థాయిలో వ్యవహరిస్తున్నదీ పరిశీలిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు సాక్షాత్కరిస్తున్నాయి.
 

హరించుకు పోతున్న ప్రజాస్వామిక విలువలు
ప్రజాస్వామిక విలువలు అంతకంతకు హరించుకు పోతున్న దేశాల్లో భారత్‌ ఆరవ స్థానంలో వున్నదని 'వీ-డెమ్‌' అనే గ్లోబల్‌ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక విలువలను, స్థితిగతులను వాస్తవాల ఆధారంగా అంచనా వేస్తుంది. ఈ దఫా 179 దేశాల సమాచారాన్ని, గత దశాబ్దపు డేటా ఆధారంగా విశ్లేషించింది. ప్రజాస్వామిక విలువల తిరోగమనం 2014లో ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చిన నాటి నుండీ ప్రస్ఫుటంగా వున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. పౌరహక్కులు, మేధోపరమైన స్వేచ్ఛ, వంటి అంశాల్లో ఎమర్జెన్సీ కాలంలో కన్నా ఘోరంగా ఉన్నదని స్పష్టంగా పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో నాణ్యత, ఓటు హక్కు ప్రభావితం అవుతున్న తీరు, మీడియా స్థితిగతులు, పౌర సమాజాల పాత్ర, సంఘ స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన, పాలనా నిర్వహణలో సమతుల్యత వంటి అనేక అంశాలపై గత దశాబ్ద అనుభవాలను పరిగణన లోకి తీసుకున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను, వ్యక్తిగత రాజకీయ స్వాతంత్య్రాన్ని హరించే విధంగా ప్రభుత్వ ఒత్తిళ్ళు తీవ్రమైనట్లు తేలింది. జమ్మూకాశ్మీర్‌ ప్రజలను ఒక ఏడాదిపాటు దారుణంగా అణచివేయడం, రాజకీయ పార్టీల, ప్రజల అభీష్టాన్ని అణచి వుంచడం, రాజ్యాంగం లోని 370, 35ఏ అధికరణలను రద్దు చేయడం వంటి చర్యలను అంతర్జాతీయ సమాజం మొత్తం ముక్త కంఠంతో ఖండించింది. ఆ రాష్ట్రంలో వుండే 136 లక్షల మంది మనోభావాలను ఛిద్రం చేస్తూ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ, కేంద్రం తన పెత్తనం లోకి తెచ్చుకోవడం, ముస్లిం మతస్తుల పౌరసత్వాన్ని రద్దు చేయబూనడం....ఇవన్నీ వీ-డెమ్‌ అధ్యయన పరిధిలోకే విధిగా వస్తాయి. మన దేశం మత స్వేచ్ఛను కాలరాసిన విషయాన్ని ప్రపంచం మొత్తం గమనించింది. అమెరికా లోని ''మత స్వేచ్ఛకి సంబంధించిన అంతర్జాతీయ కమిషన్‌'' కూడా దీనిని తీవ్రంగా ఖండించింది. మతం రీత్యా ప్రపంచం మొత్తంగా చూస్తే ముస్లింలు రెండవ పెద్ద సంఖ్య కాగా, నాల్గవ స్థానంలో హిందువులు వుంటారు. ఈ నేపథ్యంలో భారత విధానం...గల్ఫ్‌ దేశాలు ఇతర ముస్లిం దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ కారణంగా భారత్‌ పట్ల ఒక శత్రు భావం ఏర్పడే ప్రమాదం కుడా ఉంది.


లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చి కోట్లాది మంది కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా కాలరాసింది. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగానికి సంబంధిం చిన రైతులను నట్టేట ముంచే చట్టాలను ఏ చర్చా లేకుండా, అభ్యంతరాలు పట్టించుకోకుండా, ఏకపక్షంగా ఆమోదింప చేసుకుంది. ఇదంతా, లక్షలాది మంది రైతాంగం రాజధాని ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి నిరవధిక సత్యాగ్రహ దీక్షలకు దారి తీసింది. ఈ పరిణామాలన్నీ...అంతకు ముందే పూర్తయిన వీ-డెమ్‌ అధ్యయన ఫలితాలను బలపరుస్తున్నాయి.
                                                                          * వి.జి.కె. మూర్తి