- రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అణచివేత విధానాలపై పోరాటమే లక్ష్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీ ఆహ్వానంపై మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ మేరకు నిర్ణయించాయి. 'ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం- ప్రజాస్వామ్య రక్షణ' అనే అంశంపై జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికగా రాష్ట్రపర్యటనకు రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పించాలని సమావేశం నిర్ణయించింది. పోలీసుల ఏకపక్ష, దమన నిరంకుశ చర్యలను నిరసిస్తూ బాధితులకు అండగా నిలవాలని, గ్రామ, మండల స్థాయిలో ప్రజల్ని చైతన్య పరచే కార్యక్రమాల్ని నిరంతరం కొనసాగించాలని సమావేశం తీర్మానించింది. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, అర్ధరాత్రిళ్లు ఇళ్లలోకి చొరబడి బలవంతంగా తీసుకెళ్లడం, సోషల్ మీడియాలో పోస్టులపెట్టారంటూ నిర్బంధిస్తున్నారని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాలపై ఈ ప్రభుత్వం దాదాపు 1,655 కేసులు పెట్టిందన్నారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ, పాలకుల దోపిడీపై గ్రామాల్లో ఎవరైనా నోరెత్తితే పింఛన్లు, రేషన్ కార్డులు తీసేస్తున్నారని, ఇళ్లు కూల్చేస్తున్నారని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, అటువంటి సంప్రదాయమే రాష్ట్రంలోనూ మరింత భయంకరంగా అమలవుతోందని చెప్పారు. ప్రధాని మోడీ అండ చూసుకొని జగన్ ఇంకా పెట్రేగిపోతున్నారని విమర్శించారు. ధర్నాలు, ర్యాలీలు చూస్తేనే రాష్ట్ర ప్రభుత్వం భయపడిపోతోందన్నారు. జిల్లా కలెక్టర్లకు తెలియకుండానే పోలీసులు ఎక్కడపడితే అక్కడ సెక్షను 144,30లు అమలు చేస్తున్నారన్నారు. కోర్టుల తీర్పులను సైతం రాష్ట్రప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వస్తే ప్రజా ఉద్యమాలకు అనుమతి ఇస్తామని, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతామని టిడిపి హామీ ఇచ్చి ముందుకొస్తే ప్రజలకు విశ్వాసం ఉంటుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ప్రజల గురించి ఏవరూ ఆలోచించడం లేదన్నారు. ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతు, మహిళా సంఘాలను సమస్యలు చెప్పుకోనివ్వకుండా పోలీసులతో అణచివేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరూ రాజ్యాంగ రక్షణకోసం పోరాడారని చెప్పారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంతో పాటు వ్యవస్థలపై కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. పోలీస్, సిఐడి విభాగాలు అధికార పార్టీకి అనుంబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. జనసేన నాయకులు కందుల దుర్గేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ దుందుడుకు విధానాలకు ప్రతిపక్షాలు చెక్‌పెట్టకపోతే ప్రజలే నష్టపోతారని చెప్పారు. పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాజ్యహింస, నియంత్రత్వంతో ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు..జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ బాధితులైన ప్రతి ఒక్కరినీ చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రధాన సమస్యలను పాలకులు పక్కన పెట్టి ఇతర అంశాలను ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. భారత న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి చలసాని అజరు కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో రాష్ట్రపతి పాలన విధించాలని, లేదంటే నామినేషన్లు వేసే పరిస్థితి కూడా ఉండదన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లి లీగ్ అధ్యక్షులు బషీర్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఎక్కువగా ముస్లింలే కష్టాలకు గురవుతున్నారన్నారు. ఆప్ నాయకులు వరప్రసాద్ మాట్లాడుతూ కోడికత్తితో జగన్‌పై దాడి చేసిన వ్యక్తికి రాని బెయిల్ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ రాజకీయంగా పోరాడుతూ, సామాజిక అంశాలపై ఉద్యమిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమన్నారు. .ఈ సమావేశంలో నవతరం పార్టీ నాయకులు రావి సుబ్రహ్మణ్యం, దళిత జెఎసి అధ్యక్షలు బాలకోటయ్య, ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకురాలు అక్కినేని వనజ, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి షుబ్లీ, సినీయర్ జర్నలిస్టు చెవుల కృష్ణాంజనేయులు, బిసి సంఘం నాయకురాలు నూకాలమ్మ, దళిత మేథావి సంఘం నేత వినరు కుమార్ ప్రసంగించారు.










