విశ్వసనీయతకు, నిర్దిష్టతలకు ప్రామాణికంగా నిలవాల్సిన మీడియా టిఆర్‌పి రేటింగులకు కక్కుర్తిపడి మోసాలకు పాల్పడవచ్చునని రిపబ్లిక్ టి.వి ఉదతం తెలియజేస్తోంది. 2017లో రిపబ్లిక్ టి.వి ప్రారంభమే 'దొంగతనం'తో మొదలైందన్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం. దీని వ్యవస్థాపకుడైన అర్నబ్ గోస్వామి 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పని చేస్తూనే...కేరళకు చెందిన బిజెపి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ వంటి సంఘపరివార్ నేతల అండతో రిపబ్లిక్ టి.వి ని, దాని అనుబంధంగా రిపబ్లిక్ భారత్ టి.వి ని నెలకొల్పారు. 'టైమ్స్ నౌ' లో ప్రసారం చేసేందుకు సిద్ధం చేసిన ప్రత్యేక స్టోరీలకు సంబంధించిన మెటీరియల్ మొత్తాన్ని దొంగిలించి రిపబ్లిక్ టి.వి ప్రారంభోత్సవ బ్రేకింగ్ స్టోరీలుగా ప్రసారం చేశారని 'టైమ్స్' యాజమాన్యం అప్పట్లో అర్నబ్‌పై క్రిమినల్ కేసులు కూడా పెట్టింది.
అనైతిక పునాదులపై ఆరంభమైన ఈ ఛానెల్‌కు సంఘ పరివార్ భావజాలాన్ని జనాల్లోకి బలవంతంగా జొప్పించడం నిత్యకృత్యమైపోయింది. హిందూయేతర మతాలపై ద్వేషపూరిత కథనాలు ప్రసారం చేయడం, సామాజిక కార్యకర్తలను, అభ్యుదయ, ప్రగతిశీల, వామపక్ష భావజాలమున్న వ్యక్తులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడం ప్రధాన ఎజెండాగా ఈ ఛానెల్ నడుస్తోందనడంలో సందేహం అక్కర్లేదు.
ప్రజాస్వామిక పద్ధతుల్లో సాగాల్సిన చర్చను 'నేషన్ వాంట్స్ టు నో' అంటూ బిగ్గరగా అరుస్తూ ఏకపక్షంగా ముగించేసే వివాదస్పద జర్నలిస్టుగా అర్నబ్ ప్రత్యేక గుర్తింపు పొందారు. పచ్చి మితవాద, కార్పొరేట్ సమ్మిళిత వాదాన్ని జనంలోకి బలవంతంగా జొప్పించే ప్రయత్నాలకు అతను పరాకాష్ట.
జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులను పోలీసులు, కాషాయ మూకలు చొరబడి చితకబాదినా, సిఎఎ వ్యతిరేక నిరసనకారులపై కాల్పులు జరిపినా అర్నబ్ దృష్టిలో అదో గొప్ప దేశభక్తి. ఆ దాడిలో రక్తమోడిన విద్యార్థులు, ప్రాణాలు కోల్పోయిన నిరసనకారులు దేశద్రోహులు. పెద్ద నోట్ల రద్దు, జమ్ముకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం, కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలు ఆయన దృష్టిలో నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమయ్యే అత్యద్భుత ఘట్టాలు. ఎటిఎంల క్యూల్లో నిలబడలేక ప్రాణాలు కోల్పోవడం, కాశ్మీర్‌లో కొనసాగుతున్న నిర్బంధం, తరతరలుగా ఈ గడ్డపై జీవిస్తున్న ముస్లిం మైనార్టీలను తరిమేయాలనడం, లాక్‌డౌన్ వల్ల బతుకులు చాలించిన వలస కార్మికులు అతడి దృష్టిలో లేకీ విషయాలు.
దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్న కార్పొరేట్లను, వాటి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని అడ్డగోలుగానైనా బలపరచడం ద్వారా ప్రజలను తనకనుకూలంగా మలుచుకోవాలన్నదే దీని వెనుక ఉన్న అసలు కుట్ర. కోవిడ్ సంక్షోభాన్ని పరిష్కరించలేని మోడీ వైఫల్యం నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇదంతా.
హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, అనంతర పరిణామాలపై రియా పైనా, ఆమె కుటుంబం పైనా నిందలు వేస్తూ రిపబ్లిక్ టి.వి కథనాలు అల్లింది. ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా అత్యాచారానికి గురైన దళిత బాలిక విషయంలోనూ అక్కడి బిజెపి సర్కార్‌ను సమర్థిస్తూ కథనాలను ప్రసారం చేసింది. అవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు ఏకంగా టిఆర్‌పి రేటింగుల్లోనే మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించడం దాని దిగజారుడుతనానికి నిదర్శనం.
పలు టి.వి ఛానెళ్లు, పలు పత్రికలు ఈ సరళీకరణ శకంలో ప్రజలను ఎల్లో జర్నలిజంతో తప్పుదోవ పట్టించడం పరిపాటి అయింది. ఫేస్‌బుక్ కూడా ఎన్నికలలో ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేసినదీ ఇటీవల బట్టబయలైంది. మొత్తం మీద ప్రజలకు నిజాయితీగా వాస్తవాలను తెలియజెప్పే మౌలిక బాధ్యతను విడిచి ఇలా దిగజారడం ఆయా మీడియా సంస్థలకు లాభసాటిగా ఉండొచ్చు. కాని ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా ఇలా చెదలుపట్టి పుచ్చిపోతే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. దీని ప్రక్షాళనకై నిజాయితీ గల పాత్రికేయులు, మీడియా సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు వెంటనే పూనుకోవాలి. ప్రత్యామ్నాయ జర్నలిజాన్ని బలోపేతం చేయాలి.










