- అంబేద్కర్ ఆశయాలు నెరవేరుద్దాం
- విగ్రహావిష్కరణ సభలో రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్
ప్రజాశక్తి - దేవనకొండ (కర్నూలు) :ఎస్‌సి, ఎస్‌టి, బిసి అణగారిన వర్గాలు ఐక్యమత్యంతో కలిసి ఉండాలని, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ సూచించారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకనూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, ఇతర అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉండేలా రిజర్వేషన్లు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. దేశంలో ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి హక్కులను రాజ్యాంగంలో కల్పించిన మహోన్నతుడని కొనియాడారు. బ్యాంకింగ్, బహుళార్థసాధక ప్రాజెక్టు, ఎలక్ట్రికల్ గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో అంబేద్కర్ కృషి అమోఘమని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటును కొందరు వ్యక్తులు అడ్డుకోవడం, వ్యతిరేకించడం దారుణమని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, పలువురు అధికారులు పాల్గొన్నారు.










