న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విధి విధానాలను నిర్దేశించే ప్రస్తుత చట్టానికి అనేక పరిమితులు వున్నాయని అందువల్ల కొత్తగా సిబిఐ కార్యకలాపాలను, హౌదాను, అధికారాలను నిర్వచించేందుకు కొత్త చట్టం రూపొందించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. సిబిఐ దర్యాప్తుకు సాధారణ అనుమతిని అనేక రాష్ట్రాలు ఉపసంహరించుకోవడాన్ని కమిటీ ప్రముఖంగా ప్రస్తావించింది. 1963లో సిబిఐ ఏర్పడింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు అధికారాల (డిఎస్‌పిఇ) చట్టం కింద దీనికి విధి విధానాలు నిర్దేశించారు. సిబిఐ ఏ దర్యాప్తు చేపట్టాలన్నా ముందుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. అయితే, 9 రాష్ట్రాలు ఇటువంటి సాధారణ అనుమతిని ఇప్పటికే ఉపసంహరించాయి. పైగా ఢిల్లీ ప్రత్యేక పోలీసు అధికారాల చట్టానికి అనేక పరిమితులున్నందున ముందుగా ఈ సంస్థ పనితీరులో నిష్పాక్షికతకు హామీ కల్పించేందుకు గానూ కొన్ని రక్షణలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని, అలాగే అధికారాలను, హౌదాను కూడా నిర్వచించాల్సిన అవసరం వుందని కమిటీ సిఫార్సు చేసింది. అవసరమైనంత వేగంగా సిబిఐలో ఖాళీలను భర్తీ చేయడం లేదని పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది.










