గుంటూరు (ప్రతిపాడు) : జర్నలిజం రంగంలో రాణించాలంటే ప్రతి జర్నలిస్ట్ నిరంతర విద్యార్థిగా ఉండాలని, ప్రతి రోజూ రాజకీయ, సామాజిక విషయాలపై అవగాహన చేసుకుంటూ ఉండాలని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ నిర్వహించిన కార్యక్రమంలో సుచరిత పాల్గొన్నారు. జూమ్ వీడియో ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్, ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్, గుంటూరు కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల జర్నలిస్టులు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రెస్ అకాడెమీ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిజంలో పనిచేయడం అనేది ఒక గొప్ప బాధ్యతగా ప్రతి జర్నలిస్టు భావించాలన్నారు. జర్నలిస్టులు సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలకపాత్ర పోషిస్తారని, అంతేగాకా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వుంటూ మంచి చెడులను విశ్లేషిస్తుంటారని తెలిపారు. ప్రజలకు ఎప్పుడు సమస్య వచ్చినా ముందుగా వాలిపోయేది జర్నలిస్టులేనని, ఏ సంఘటన జరిగినా ముందుగా జర్నలిస్టే చూస్తాడని, అక్కడి సమస్యలను విని సమాజానికి తెలిసేలా వార్తలను రాస్తాడని అన్నారు. తన సొంత కష్టాలను కూడా మరిచి సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్ట్ పరితపిస్తుంటాడని, ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీడియా రంగంలో అనేక మంది గొప్ప గొప్ప జర్నలిస్టులు ఐకాన్‌గా చెడుకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. నిజాలను నిర్ధారించుకొని, నిర్భయంగా రాయాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల జర్నలిస్టులు నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రెస్ అకాడమీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రెస్ అకాడమీ చేపడుతున్న చర్యలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎంతో బాధ్యతాయుతమైన జర్నలిజం రంగంలో యువ జర్నలిస్టులు రాణించాలని, సమాజహితం కోసం పనిచేయాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.










