ప్రజాశక్తి - గాజువాక
గాజువాక సంఘటనపై దిశా చట్టం కింద ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గాజువాక సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో బలైన వరలక్ష్మి కుటుంబాన్ని సోమవారం మంత్రి పరామర్శించారు. రూ.10లక్షల ఆర్థిక సహాయం చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మ ప్రియ, పి.సత్య గురునాథ్‌కు హోంమంత్రి, జిల్లా కలెక్టరు వి.వినరు చంద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అందించారు.
అనంతరం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దిశా చట్టం చేసిన తరువాత జరిగిన 390 ఘటనలలో 7రోజులలో దర్యాప్తు పూర్తి చేశామని, 108 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని తెలిపారు. చిత్తూరులో చిన్నారి బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో 7 నెలలలోనూ, విజయవాడలో చిన్నారి పాపను అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో 4 నెలలలోనూ నిందితులకు ఉరిశిక్ష ఖరారైందని చెప్పారు. యుక్త వయస్సు వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు భద్రత గురించి తెలియజేయాలన్నారు. చట్టాలపై మగ, ఆడ పిల్లలకు అవగాహన కలిగించడానికి తగు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతి విద్యార్థిని దిశ యాప్, ఎపి.పోలీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని తెలిపారు. ఇలాంటి సంఘటనలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, కౌన్సెలింగ్ ఇప్పించి మళ్లీ వాటికి పూనుకోకుండా హెచ్చరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరు వి.వినరు చంద్ బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశా చట్టం ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, డిసిపి ఐశ్వర్య రస్తోగి, ఎసిపి రామాంజనేయరెడ్డి, విశాఖ ఆర్‌డిఒ పి.కిషోర్, గాజువాక తహశీల్దారు ఎంవిఎస్.లోకేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










