పండగలన్నింటిలో వినాయక చవితి సందడే వేరు. పెద్ద పెద్ద విగ్రహాలు, హోరెత్తే మైకులతో అంతా హడావిడిగా ఉంటుంది. విగ్రహాలను తీసుకెళ్లి నదుల్లో, జలాశయాల్లో నిమజ్జనం చేయటం మరింత సందళ్ల కార్యక్రమం. వీటన్నిటిలో పర్యావరణానికి హాని చేసే కొన్ని ఆచరణల పట్ల చాలా కాలంగా పర్యావరణ వాదులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. కొద్దికాలంగా కొంత మార్పు వస్తున్నా... పెద్ద పెద్ద విగ్రహాల పోటీ కొనసాగుతూనే ఉండేది. కానీ, ఇప్పుడు కరోనా కారణంగా ప్రశాంతంగా, పర్యావరణ హితంగా పండగ జరుపుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు మహానగరాల నుంచి మారుమూల గ్రామాల వరకూ ఎక్కడ చూసినా కరోనా వార్తలే. ఈ నేపథ్యంలో సందళ్లకు, పండగలకు కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. గతంలో మాదిరి గుంపులు గుంపులుగా జనం ఉండే పరిస్థితి లేదు. అంతా ఆ దేవుడే చూసుకుంటాడు మనకేం కాదు అనుకొనే రోజులు పోయాయి. విజ్ఞానంతో మెలగకపోతే ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి యావన్మంది ప్రజలు ఆరంభం నుంచే అప్రమత్తంగా ఉండాలి. మీతో పాటు మీ కుటుంబాల ఆరోగ్యానికి కూడా రక్షణ కల్పించాలి.
ఒకప్పుడు వినాయక చవితిని ఇళ్లల్లోనో, ఊరందరికీ కలిపి ఒక పందిరిలోనో జరుపుకునేవారు. 1890లలో ఆనాటి జాతీయోద్యమకారులు ఈ పండుగను జనబాహుళ్యంలోకి తీసుకువచ్చారు. బాలగంగాధర్‌తిలక్ ఈ ఆచారానికి నాంది పలికారు. మతవిశ్వాసాలు అధికంగా ఉన్న ప్రజల్లో జాతీయవాదం భావం పెంపొందించేందుకు ఈ పండుగను ఒక సాధనంగా వాడారు. రానురాను ఆ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పెద్ద పెద్ద కూడళ్ల నుంచి చిన్న చిన్న గల్లీల వరకు వాడవాడలా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన వినాయకుని ప్రతిమలు వెలుస్తున్నాయి. ఆడంబరంగా నిర్వహించేందుకు పెద్దమొత్తంలో నిధులు సేకరించడం ఆనవాయితీగా మారింది. రోడ్డుకు అడ్డంగా స్టేజీలు కట్టి విగ్రహాలను పెట్టడం తొమ్మిది రోజుల పాటు పూజాకార్యక్రమాలు నిర్వహించడం సాధారణమై పోయింది. ఆ తొమ్మిది రోజులూ ట్రాఫిక్ అంతరాయమే కాక, లౌడ్ స్పీకర్ల నుంచి వచ్చే ధ్వని కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఉత్సవం చివరి రోజున అన్న సంతర్పణలు పెట్టినా ఆహారం వృధా అయ్యేది. అక్కడికి వెళ్లి పేదవారు భోజనం చేయడం కష్టమే. ఎక్కడో కొన్నిచోట్ల ప్రత్యేకంగా పేదవారికి భోజనాలు పెట్టేవారు. ఆ తొమ్మిది రోజులూ పాటలు, డ్యాన్సులతో హంగామా చేసేవారు. విగ్రహ నిమజ్జనం రోజున పోలీసుల రక్షణలోనే వాటిని తరలించాల్సి వచ్చేది. నదులూ జలాశయాలూ విగ్రహ వ్యర్థాలతో కలుషితం అయ్యేవి.
కరోనాతో ఆ ఆనవాయితీ మారింది. విగ్రహప్రతిమల ఆకారంలో ఆంక్షలు పెట్టారు. పెద్ద పెద్ద విగ్రహాలకు అనుమతి లేదు. కొంతమంది వర్చువల్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. పూజా కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడమే కాక, అందులో పాల్గొనేలా వీలు కల్పిస్తున్నారు.
పర్యావరణ హితం కోసం ...
ఒకప్పుడు పండుగకు కొన్ని రోజుల ముందే టీవీ ఛానెళ్లలో, పాఠశాలల్లో పర్యావరణ హితార్థం 'ఎకో గణపతి'పై అవగాహన కల్పించేవారు. మట్టితో చేసిన ప్రతిమలనే పూజకు ఉపయోగించాలని ప్రచారం చేసేవారు. మొదట్లో అంతగా లేకపోయినా కొన్నేళ్ల క్రితం నుంచి జనంలో పర్యావరణంపై కాస్తంత శ్రద్ధ పెరిగింది. కొద్దిలో కొద్ది మందైనా మట్టి వినాయకులకే పూజలు చేయడం ప్రారంభించారు. అలా సముద్రంలో ఆవగింజంత మార్పు కనబడింది. పర్యావరణ ప్రేమికులు ప్రతి ఏడాది వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసేవారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఎలాంటి వస్తువులూ వినియోగించవద్దని కూడా ప్రచారం జరుగుతుండేది. పత్రి కోసం చెట్లను నరకవద్దని, పర్యావరణానికి హాని కలిగించవద్దని, దానివల్ల జరిగే అనర్థాలను ఏకరువు పెట్టేవారు. ఇలా పండుగ పదిరోజులు ఉందనగానే అవగాహనా కార్యక్రమాలు చేసేవారు. కాని ఇప్పుడు కరోనానే మొత్తం కట్టడి చేసింది.
విగ్రహాలకు, పూజాది కార్యక్రమాలకు పెట్టే ఖర్చును పేదలకు పంచిపెట్టాల్సిన తరుణం ఇది. నమ్మకాలను ఎవరూ వ్యతిరేకించరు. అది వ్యక్తిగతం. కాని ఇప్పుడు మనిషి వ్యక్తిగా కంటే శక్తిగా మారే పరిస్థితి వచ్చింది. ఆ శక్తితో ఆకలిగొన్నవారికి అన్నం పెట్టొచ్చు. పని లేని వారికి పని కల్పించవచ్చు. లేదా కనీసం మానసికంగా కుంగిపోయిన వారికి భరోసా ఇవ్వవచ్చు. ఇప్పుడు మానవ సంబంధాలన్నీ మానవత్వంతో పరిమళించాల్సిన సమయం. ఇప్పటివరకు ఒకరికొకరు సాంప్రదాయ పండుగల వాతావరణంలో కలసిమెలసి ఉండుంటారు. ఇప్పుడు కరోనా వచ్చి ఆ పండుగల వాతావరణాన్ని మార్చింది అంతే. మనలో ఉన్న మానవత్వం అలాగే ఉంది. దాన్ని వ్యక్తపరిచే అవకాశం ఇది. ''పిండివంటలతో, షడ్రుచులతో భోజనం కాదు కదా, ఒక్కపూట తిండికి కూడా నోచుకోని దుర్భర పరిస్థితుల్లో ఉన్న మీ తోటివారు ఎంతోమంది మీ చుట్టుపక్కలే ఉన్నారు. వారికి ఈ పండుగ సందర్భంగా మేమున్నామని ధైర్యం చెప్పండి. ఆడంబరంగా పండగ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఖర్చుతో కొంతమంది ఆకలినైనా తీర్చుదాం.. '' అంటూ పర్యావరణ వాదులు హితవు చెబుతున్నారు. వేలకు లక్షలకు లడ్డులను వేలంలో కొని పంచటం కన్నా... ఆ మొత్తాలను అవసరమైనవారికి ఉపయోగించాలని కోరుతున్నారు. కరోనా కారణంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పర్యావరణ హితంగా, ప్రజాహితంగా మలుచుకోవటం మంచిదే కదా!










