Nov 28,2022 21:43

పెచ్చులూడిన ఐసిడిఎస్‌ కార్యాలయ భవనం

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయ భవనం ప్రమాదకర స్థితికి చేరింది. పాత భవనం కావడంతో పెచ్చులు ఊడి పడుతున్నాయని సిబ్బంది భయపడుతున్నారు. కార్యాలయంలో సిడిపిఒతో పాటు నలుగురు సూపర్వైజర్లు, ఒక టైపిస్టు, ఇద్దరు అటెండర్లు, ఒక కో ఆర్డినేటర్‌ పనిచేస్తుంటారు. పాత భవనం కావటంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది భయాందోళన మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు.
మడకశిర నియోజకవర్గంలో 438 దాకా అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు దాదాపు 808 మంది దాకా పనిచేస్తున్నారు. వారానికి రెండు మూడు రోజులు కనీసం ఏదో ఒక సమస్యపై ఐసిడిఎస్‌ కార్యాలయంలో సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాల్లో భయంభయంతోనే జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కార్యాలయంలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉనానయి. అక్కడ కనీసం నీటి సౌకర్యం కూడా లేదు. మరుగుదొడ్లకు తలుపులు కూడా లేకపోవటంతో అక్కడికి వచ్చిన వారు కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఐసిడిఎస్‌ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఐసిడిఎస్‌ కార్యాలయ భవనానికి మరమ్మతులు చేయించాలని. అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.