నల్లచెరువు : సచివాలయాల ద్వారా మెరుగైన సేవలను అందించి ప్రజలకు వాటిని మరింత చేరువు చేయాలని కలెక్టర్ బసంత్‌కుమార్ సిబ్బందికి సూచించారు. మంగళవారం నాడు మండల పరిధిలోని ఎం.అగ్రహారం, ఓరువాయి, తలమర్లవాండ్ల పల్లి గ్రామ సచివాలయాలను తనిఖీ చేయడంతో పాటు ఈ క్రాప్ బుకింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సచివాలయాల్లో వివిధ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన అర్హులైన జాబితా, అనర్హులైన లబ్ధి పొందిన జాబితాను ఖచ్ఛితంగా ప్రదర్శించాలని తెలిపారు. ప్రతి వాలంటీర్ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయా గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎం.అగ్రహారం గ్రామంలో సచివాలయం తనిఖీ అనంతరం కలెక్టర్ ద్విచక్ర వాహనంలో వెళ్లి మద్దిమడుగు వెంకటరమణ అనే రైతు టమోటా పంటను పరిశీలించారు, ఈ పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పంటల బీమా పరిహారంలో ఎలాంటి పొరపాట్లు ఉండకుండా వాటిని సరిచేయాలని సూచించారు. ఖరీఫ్ కాలంలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఉచిత సేవలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ఎంపీడీవో శకుంతల, వ్యవసాయ అధికారి భారతి, అగ్రికల్చర్ ఏడీ సత్యనారాయణ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










