Apr 14,2022 06:57

'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు పెద్దలు. ముఖ్యంగా మన దేశంలో పేదరికం, అవిద్య, సామాజిక అసమానతలు, అపరిశుభ్రమైన వాతావరణం వల్ల అనేక వ్యాధులు సోకి ప్రతి సంవత్సరం అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో నేటికీ అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా, ఆరోగ్య రంగానికి ఇప్పటికీ స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.82 శాతం నిధులు మాత్రమే మంజూరు చేయుట శోచనీయం. ప్రపంచంలోనే 18 శాతం జనాభా మనదేశంలో ఉన్న ప్రస్తుత తరుణంలో కనీసం 6 శాతం జిడిపి నిధులు మంజూరు చేయాలి. నేటికి మూడు పూటలా తిండి లేని ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆకలి చావులు తరుచూ దేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సామాజిక సమస్యగా ఉంటోంది. పౌష్టికాహార లోపంతో రక్తహీనతతో బాధపడే బాలికలు, మహిళలు ఎక్కువగా ఉన్నట్లు తాజా జాతీయ ఆరోగ్య నివేదిక తెలిపింది. ప్రభుత్వాలు ఆరోగ్య రంగం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మన ఆరోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో కరోనా మొదటి/రెండు దశల్లో మనం కళ్ళారా చూశాం. కొన్ని లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనికి ప్రధాన కారణం విద్య, వైద్య రంగాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడమే. తగిన నిధులు మంజూరు చేయకపోవడమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకు ఒక ఎంబిబిఎస్‌ డాక్టర్‌ ఉండాలి. కానీ మన దేశంలో నేటికీ 1456 మందికి ఒక డాక్టర్‌ మాత్రమే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది నూటికి 80 శాతం పట్టణాల్లో పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు చాలా తక్కువ. ఇక గిరిజన ప్రాంతాల్లోనైతే వైద్య సదుపాయాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రసవ వేదన పడుతున్న గర్భిణీ స్త్రీలను అనేక కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి 'డోలీ'లపై మోస్తూ తీసుకుని వెళుతున్న సంఘటనలు అనేకం.
       నేటికీ మన దేశంలో వైద్య సీట్లు 90,825 మాత్రమే. అందులో 46 శాతం మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో ఉండగా, మిగిలిన సగం పైబడి సీట్లు ప్రయివేటు కళాశాలల్లో ఉండటం వలన వైద్య విద్య సామాన్యులకు అందుబాటులో లేదు. ప్రయివేటు కళాశాలల్లో చదవడానికి సుమారు కోటి రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య విద్య అందుబాటులో లేకపోవడం వల్ల తక్కువ ఫీజు తీసుకుంటున్న ఉక్రెయిన్‌, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలకు వెళ్లి చదువుతున్నారు. ప్రస్తుతం 'రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం' వలన అనేక మంది వైద్య విద్యార్థులు ప్రాణాలు అరచేతుల్లో ఉంచుకుని, వైద్య విద్య మధ్యలో ఆపేసి మన దేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. వీరి భవిష్యత్తు ఏమిటో... అర్థంకాని పరిస్థితి. ఇకనైనా మన దేశంలో వైద్య సీట్లు 1,50,000 వరకూ పెంచాలి. ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించాలి.
       ప్రతీ సంవత్సరం మలేరియా, ఎయిడ్స్‌, రక్తహీనత, సీజనల్‌ వ్యాధులతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌ ఇచ్చే స్థితిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోవడం శోచనీయం. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను వేళ్ళ మీద లెక్కించే పరిస్థితి. ఏదైనా విపత్తు సంభవిస్తే...(ప్రస్తుత కరోనా కాలంలో వలే) ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి 'మీ ఆరోగ్యం మీరే చూసుకోండి' అని చేతులు దులుపుకుంటున్నాయి. మందులు, ఆసుపత్రిలో గదులు దొరక్క, ఆక్సిజన్‌ సిలిండర్‌ లభించక అనేక మంది ప్రాణాలు కోల్పోయిన భయానక స్థితిని మనం కోవిడ్‌ సమయంలో చూశాం. భవిష్యత్తులో కరోనా ఫోర్త్‌ వేవ్‌ అంటున్నారు...! అప్పటికైనా ప్రభుత్వాలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటాయా? నార్డిక్‌ దేశాల (డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌...) వలే మన దేశం కూడా విద్యా, వైద్య రంగాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. అప్పుడే ఆరోగ్య భారత్‌ ఆవిర్భవిస్తుంది.
                                            - ఐ. ప్రసాదరావు, సెల్‌ : 9948272919