Jan 24,2023 22:19

పరిటాల ఘాట్‌ వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

కనగానపల్లి : పరిటాల రవీంద్ర మరణించి 18ఏళ్లు గడిచినా అభిమానం చెక్కుచెదరలేదని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని పరిటాల శ్రీరామ్‌ అన్నారు. పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన స్వగ్రామం రామగిరి మండలం, వెంకటాపురం గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఉదయం పరిటాల ఘాట్‌ వద్ద పరిటాల శ్రీరామ్‌ తో పాటు ఇతర కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.ఉదయం 8 గంటల నుంచే జనం తాకిడి కనిపించింది. నందమూరి కుటుంబం నుంచి సినీ నటుడు తారకరత్నతో పాటు, శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బికె పార్థసారథి, హిందూపురం మాజీ పార్లమెంట్‌ సభ్యులు నిమ్మలకిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌, మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పూల నాగరాజు, సవితమ్మ ఇంకా పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ఈసందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. కేవలం అనంతపురం జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు అధికసంఖ్యలో వచ్చారు. అభిమానులు భారీగా తరలిరావడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఈసందర్భంగా పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ పరిటాల రవీంద్ర ఆశయ సాధన కోసం తనతో పాటు తమ కుటుంబసభ్యులంతా పని చేస్తున్నామన్నారు. ఆయనపై ఇంత అభిమానం చూపుతున్న వారందరికీ పేరు పేరునా కతజ్ఞతలు తెలిపారు
నందమూరి, పరిటాల కుటుంబాలు వేర్వేరు కాదు
పరిటాల కుటుంబం, నందమూరి కుటుంబం వేర్వేరు కాదని సినీ నటుడు నందమూరి తారకరత్న అన్నారు. పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఆయన వెంకటాపురం వచ్చారు. శ్రీరామ్‌ తో కలసి ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రవి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ పరిటాల రవీంద్ర తనకు సోదర సమానుడన్నారు. పరిటాల కుటుంబానికి నందమూరి కుటుంబం అండగా ఉంటుందని తారకరత్న అన్నారు.