May 12,2022 20:57

మాట్లాడుతున్న జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ పాపారావు
ప్రజాశక్తి- నెల్లిమర్ల : పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తున్నాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ పాపారావు అన్నారు. గురువారం సెంచూరియన్‌ విశ్వ విద్యాలయంలో విద్యార్ధులకు పరిశ్రమల స్ధాపనకు గల అవకాశాల గురించి వివరించారు. విద్యార్ధులు కేవలం ఉద్యోగాల వైపే మొగ్గు చూపకుండా పరిశ్రమలు స్థాపించి మరి కొంత మంది యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలన్నారు. సొంతంగా యూనిట్‌ పెట్టాలనుకునే వారు తమను సంప్రదించాలని కోరారు. సెంచూరియన్‌ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ క్యాంపస్‌లో చేపడుతున్న ఇ-వాహనాల తయారీ యూనిట్‌, టిస్యూ కల్చర్లో స్ట్రాబెర్రీ ఉత్పత్తులు తదితర వాటి గురించి వివరించారు. ఎస్‌సి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కామేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్ధులు పరిశ్రమలు స్థాపిస్తే వారికి ప్రభుత్వం నుంచి ఏ రకమైన ప్రోత్సాహకాలు ఉంటాయో వివరించారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రూల్‌ 72, 5సి పదాల గురించి వివరించారు. ముద్రా రుణాలు పరిమితి రూ.50వేలు నుంచి రూ.10 లక్షల వరకు ఉందని, పిఎంఇజిపి రుణాలు పరిమితి రూ.25 లక్షలు గాను, స్టార్టప్‌ ఇండియా పధకం ద్వారా ఎస్‌సి, ఎస్‌టి మహిళా ఔత్సాహిక వేత్తలు కలిపి పరిశ్రమ నెలకోల్పేందుకు ముందుకు వస్తే అటువంటి వారికి రూ.కోటి వరకు రుణం పొందే అవకాశం ఉందన్నారు. స్టార్ట్‌ అప్‌ ఇండియాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి ఇన్సెంటివ్‌, జిఎస్టీ, ఐటి వంటి వాటిలో రాయితీ ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వంశీ మోహన్‌ ఎస్‌సి కార్పోరేషన్‌ ఇఒ శంకరయ్య, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పిఎస్‌వి రమణారావు, పారా మెడికల్‌ డీన్‌ డాక్టర్‌ లక్ష్మీ నరసింహాచార్యులు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ శాంతమ్మ, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.