ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22 నుండి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మణిపూర్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుండి పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీకి పోరుబాట పట్టనున్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గంటున్న హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ పంజాబ్, హర్యానా రాష్ట్రాల అన్నదాతలకు అదనంగా తరలివెళ్లనున్నారు. ఈ నెల 26, ఆగస్టు 9న మహిళా రైతుల ప్రత్యేక మార్చ్‌లు ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశం అంతటా చేపట్టనున్నారు. దేశం నలుమూలల నుండి వచ్చిన రైతులు తమ డిమాండ్లను పార్లమెంట్ ముందు ఉంచడానికి, వారి గొంతులను వినిపించడానికి క్రమశిక్షణతో పార్లమెంటుకు కవాతు చేస్తారని ఎస్‌కెఎం నేతలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎస్‌కెఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్ తదితరులు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. హర్యానాలోని సిర్సా పోలీసులు రైతులను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేయడాన్ని ఎస్‌కెఎం నేతలు ఖండించారు. బిజెపి ప్రభుత్వ ఒత్తిళ్లతోనే పోలీసులు తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సింఘూ సరిహద్దులో రైతుల ఉద్యమానికి మద్దతుగా ప్రముఖ పంజాబీ కళాకారులు బాబ్బు మన్, అమిటోజ్ మన్, గుల్ పనాగ్ కార్యక్రమం నిర్వహించారు. రైతు ఉద్యమానికి కళాకారులు తమ పూర్తి సహకారాన్ని అందించారు. రైతుల మద్దతుగా నిలబడాలని, రైతుల ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.










