ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాతంగా నిర్వహిద్దాం
కలెక్టర్ గిరీష
ప్రజాశక్తి-రాయచోటి : పోలీస్, సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి కేంద్రాలలోని సౌకర్యాలను పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరీష్ పోలీస్, సెక్టోరల్ అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి పోలీస్, సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరీష్ మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దామని, ఎన్నికలలో పోలీస్, సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి కరెంట్, టాయిలెట్స్, ఫర్నిచర్, ర్యాంపులు తదితర సౌకర్యాలను గుర్తించాలని సౌకర్యాలు లేని చోట సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్, సెక్టోరియల్ అధికారులు, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్నికల విధులలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. వల్నరబిలిటి, క్రిటికల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల రిపోర్టు యుద్ధ ప్రాతిపదికన పంపాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఓటర్ల పై అధికంగా ప్రభావం చూపే వల్నరబిలిటి (సమస్యాత్మక) ప్రాంతాలను పోలీసుల సహకారంతో గుర్తించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల రూట్లను ముందుగానే చూసుకోవాలన్నారు. పోలింగ్ కు ముందు రోజు మెటీరియల్ పంపిణీ, సెక్యూరిటీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల విధులలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ సిబ్బందిని 10 శాతం రిజర్వ్ పెట్టుకొని, అవసరం ఉన్నచోట వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రం వంద మీటర్ ల పరిధిలోపు ఎవరికి అనుమతి ఇవ్వకూడదన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో గతంలో జరిగిన సంఘటనలు, బైండోవర్ వివరాలను స్థానిక పోలీసు అధికారులను సంప్రదించి తెలుసుకోవాలన్నారు. సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు : ఎస్‌పి
ఎమ్మెల్సీ ఎన్నికలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. అధికారులందరూ ఎన్నికలను సీరియస్‌గా తీసుకొని పనిచేయలన్నారు. పోలీస్, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. బైండోవార్స్, గత ఎన్నికలలో జరిగిన సంఘటనలు, అటువంటి వాటి మీద ప్రత్యేక నిఘా ఉంచి, ముందస్తుగా పోలీస్ పికెటింగ్ పకడ్బందీగా చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్డీఓలు, డీఎస్పీలు, పోలీస్, సెక్టోరియల్, తదితరులు అధికారులు పాల్గొన్నారు.










