పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో రబీకి సబంధించి పంట నమోదు ప్రక్రియను పకడ్బందీగా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఎ.రమణారెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రబీ ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ప్రొక్యూర్మెంట్, ఇన్సూరెన్స్, ఇనుపుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో క్షేత్రస్థాయిలో రైతులు ఏ పంట సాగు చేశారు.? ఎన్ని ఎకరాల్లో వేశారు.? తదితర అన్ని రకాల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా చిరుధాన్యాలను సబ్సిడీ పైన రైతులకు అందించి వాటి సాగును ప్రోత్సహించాలని అధికారులను కోరారు. ఆర్‌బికెల ద్వారా రైతులకు కావాల్సిన సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు అందించి జిల్లాలో వ్యవసాయ అభివద్ధికి కషి చేయాలన్నారు. మొక్కజొన్న పంటకు బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ బసంత్‌కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున రైతులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించి వాటి సాగును ప్రోత్సహించే విధంగా సూచనలు, సలహాలు క్షేత్రస్థాయిలో అందివ్వాలని తెలిపారు, ఒక సెంటు భూమి కూడా తప్పిపోకుండా పంట నమోదు ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం, ఈ క్రాప్ బుకింగ్ ఎన్ని ఎకరాలు చేయాల్సి ఉంది, ఈ క్రాప్ బుకింగ్ లో పాటించాల్సిన అంశాలు, రైతు భరోసా కేంద్రాలలో ఎరువుల లభ్యత తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అగ్రి అడ్వయిజరీ బోర్డ్ ఛైర్మన్ రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారుల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, డిడబ్ల్యూఎంఎ పీడీ రామాంజనేయులు, డిపిఎం లక్ష్మణ్ నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, సిరికల్చర్ జెడి పద్మావతి, జిల్లా అగ్రికల్చర్ ట్రేడ్, మార్కెటింగ్ అధికారి నరసింహమూర్తి, కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త సంపత్ కుమార్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










