కడప అర్బన్ : ప్రజల పక్షం నిలబడే పశ్చిమ రాయలసీమ శాసనమండలి ఉపాధ్యాయ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం యుటిఎఫ్ కార్యాలయంలో ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ, ఎస్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న మాట్లాడుతూ ప్రజా, ఉద్యోగుల వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు ఉండాలని పేర్కొన్నారు. అందుకోసం నిరంతరం ప్రజల పక్షం నిలబడి వారి కోసం పోరాడుతున్న వారు శాసనమండలి ఎన్నికలలో నిలిచారని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందన్నారు. న్యాయమైన కోరికలను పరిష్కరించకుండా భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. పాఠశాల విలీనం పేరుతో విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిందని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగాలు భర్త చేస్తామని చెప్పి మిగులు ఉపాధ్యాయులను చూపించటం దుర్మార్గమన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను నట్టేట ముంచిందన్నారు. పాఠశాల, కళాశాలలో ఉపాధ్యాయ, ఉద్యోగాలు, ఎపిపిఎస్‌సి గ్రూప్ 1, 2, 3, 4 ఇంజినీరింగ్ ఇతర శాఖలలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికై ఉపాధ్యాయులు విద్యారంగ, విద్యాభివృద్ధి కోసం అనేక పోరాటాలు, చట్టసభల్లో మాట్లాడిన కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామాజిక పోరాటాలలో క్రియాశీలక పాత్ర పోషించి నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాయలసీమ ప్రాంత అభివ ద్ధి కోసం కృషి చేస్తున్న పోతుల నాగరాజును గెలిపించి చట్టసభలకు పంపించాలన్నారు. అధికార పార్టీకి శాసనసభలో, శాసనమండలిలో అత్యధిక మెజార్టీ ఉందని వాళ్లు ఆడింది ఆట పాడిందే పాటగా ఇష్టానుసారంగా ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ ఉద్యోగులపై కక్ష కట్టారన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే పట్టభద్రుల అభ్యర్థి పోతుల నాగరాజు, ఉపాధ్యాయ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి అండగా నిలిచి వారిని గెలిపించి చట్టసభలకు పంపించాలన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్ బాబు, శివారెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజ, ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు విజరు కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి , పులి కృష్ణమూర్తి, ఎం.వి.సుబ్బారెడ్డి, పి.చంద్రశేఖర్, సుబ్బరాయుడు, వెంకటశివ, కె.సిబాదుల్లా, విజయలక్ష్మి, సి.సుబ్రహ్మణ్యం, శ్రీరాములు, జిల్లా సమితి సభ్యులు వెంకట్రాయుడు, జకరయ్య, మద్దిలేటి, కొమ్మాద్ది ఈశ్వరయ్య, పి.మస్తాన్, షరీఫ్, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.దస్తగిరి, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ పాల్గొన్నారు.
- సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణ










