Dec 30,2020 07:31

కోవిడ్‌ తెచ్చిన తంటా అంతా ఇంతా కాదు. పెద్దలకు పనుల్లేకుండా చేసింది. పిల్లలకు చదువును దూరం చేసింది. ఒకప్పుడు మన ప్రాంతంలో అక్కడక్కడా మాత్రమే బాల కార్మికులు కనిపించేవారు. కాని ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ నోయిడా ప్రాంతంలో ఉన్న ఓ దాబాలో పదహారేళ్ల కుర్రాడు చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితమే బాల కార్మికుడిగా గుర్తించి ఆ పని నుంచి పోలీసు వారు అతనిని విడిపించారు కూడా. అయితే ఒకవారం రోజుల తరువాత అతడు మళ్లీ ఆ పనిలో చేరాడు. ఎందుకు మళ్లీ ఇక్కడకు వచ్చావని ప్రశ్నిస్తే... 'లాక్‌డౌన్‌లో మా కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. ఏదైనా పని దొరుకుతుందేమోనని ఆగస్టులోనే జార్ఖండ్‌ నుంచి నేను, అమ్మ ఇక్కడకు వచ్చాం. సెక్టార్‌-7లో ఓ కంపెనీలో అమ్మ మిషను కుట్టే పనికి కుదిరింది. ఇటీవలె అమ్మకు పని పోయింది. నాకు మాత్రమే పని ఉంది. ఈ పరిస్థితుల్లో పనిచేయడం తప్పనిసరి. ఎలాగో స్కూళ్లు ఆన్‌లైన్‌ ద్వారానే నడుస్తున్నాయి కదా. ఎక్కడ నుంచైతే ఏమిటి? వీలు చిక్కినప్పుడు క్లాసులు వింటాను. మిగిలిన సమయంలో పని చేసి అమ్మకు సాయంగా వుంటాను' అని చెప్పాడు.

చిన్నతనంలోనే తండ్రి కోల్పోయిన ఆ బాలుడు ఇక్కడకు రాకముందు జార్ఖండ్‌లో తన సొంత గ్రామంలోనే చదువుకునేవాడు. అతనితో పాటే పనిచేస్తున్న మరో బాలుడి కథ కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. బెంగాల్‌ నుంచి నోయిడాకు చేరుకుని ఈ దాబాలో పని చేస్తున్నాడు. 'లాక్‌డౌన్‌ తరువాత 12-14 ఏళ్ల వయసున్న చాలామంది పిల్లలు పని వెతుక్కుంటూ ఇక్కడకు వస్తున్నారు. వారికి పని ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ కాకపోతే మరోచోటైనా వారికి పని ఇచ్చేవారు ఉంటారు. వారికి ఆ పని ఎంతో అవసరం కూడా' అంటాడు దాబా యజమాని. లాక్‌డౌన్‌ సమయంలో తల్లిదండ్రులు పనికోల్పోవడంతో వృత్తిశిక్షణ వైపు చాలామంది పిల్లలు తరలిపోయారు. స్కూళ్లు మూతబడి చదువుకు దూరమైన పిల్లలు ఒత్తిడికి గురవ్వకుండా ఉండాలంటే వృత్తి శిక్షణలో నైపుణ్యం సాధించడమే మేలని, ఆ పని వారికి కొంత ఉపశమనంగా వుంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నోయిడాలో మాత్రమే ఈ పరిస్థితి లేదు. మన చుట్టుపక్కల హోటళ్లు, షాపుల్లో లేదా బిల్డింగ్‌లు, అపార్టుమెంటుల వంటి పెద్ద పెద్ద ఇళ్ల మరమ్మతులు చేయించుకునే దగ్గర ఇప్పుడు పెద్దవారితో పాటు చిన్నపిల్లలూ పనులకు వస్తున్నారు. కరెంటు పనివారిగా, వడ్రంగి పనివారిగా, ఇతర వృత్తిపనివారితో పాటు వారి పిల్లలు రావడం ఈ మధ్య ఎక్కువైంది. స్కూలుకు వెళ్లడం లేదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆన్‌లైన్‌ లోనే కదా? ఇంటికి వెళ్లి చదువుకుంటాను అని సమాధానం వస్తోంది.

ఒక సర్వే ప్రకారం దేశంలో అల్పాదాయ కుటుంబాల పిల్లల్లో 78 శాతం మంది లాక్‌డౌన్‌కు ముందు కాలమే చదువుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పారు. ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల స్కూలు వాతావరణం, ఆమేర అధ్యయనం లేదు. పైగా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే బాలికలలో 2/3 శాతం మందిపై ఇంటి పనులు, పిల్లల సంరక్షణ వంటి పనుల భారం పడిందని తేలింది. షెడ్యూల్‌ తెగలు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన కులాలు, మైనార్టీ కుటుంబాలకు చెందినవారి పిల్లలు కోవిడ్‌ తదనంతర పరిస్థితులపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, అసోం, తెలంగాణ, ఢిల్లీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే 3 వేలకు పైగా కుటుంబాలను సర్వేలో కలుసుకున్నారు.
(ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌)