Dec 06,2022 14:41
  • యువతిని రాళ్లతో కొట్టి హత్య చేసిన వైనం

ప్రజాశక్తి-కదిరి టౌన్‌  :  శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. వాషింగ్‌ మిషన్‌ నుంచి వెళ్తున్న వృథా నీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కదిరి పట్టణంలోని మశానంపేట కాలనీలో పద్మావతి బాయి, మనోజ్‌ కుమార్‌ దంపతులు నివసిస్తున్నారు. పద్మావతిబాయి ఇంట్లోని వాషింగ్‌ మిషన్‌ నుంచి వచ్చే వృథా నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్‌ ఇంటి ముందుకు వెళ్లాయి. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పద్మావతిపై ఇనుప రాడ్డు, బండరాళ్లతో వేమన్న నాయక్‌, ఆయన కుమారుడు ప్రకాష్‌నాయక్‌ దాడిచేశారు. దీంతో ఆమె ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు పద్మావతిని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో ఆమె మరణించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.